
న్యూఢిల్లీ: టీపీసీసీ చీఫ్ రేవంత్, ములుగు ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు టీ కాంగ్రెస్ నేతలు అమెరికాలో నిర్వహించిన తానా సభలకు హాజరయ్యారు. పలువురు ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సంచలన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించదని, ఇది కాంగ్రెస్ పాలసీ అని వివరించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తుందని, దళిత, గిరిజనులకు కూడా పదవులు దక్కుతాయని తెలిపారు. అవసరమైతే సీతక్కనే సీఎం అవుతుందని చెప్పడం సంచలనంగా మారింది.
తానా సభలో ఓ ఎన్ఆర్ఐ రేవంత్ రెడ్డికి కీలకమైన సూచన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు లేదా గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అడిగారు. దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సూచనను తాను స్వీకరిస్తున్నానని, పార్టీలో దీనిపై చర్చిస్తానని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు గౌరవం ఇస్తుందని చెప్పారు. ఇందుకు మల్లికార్జున్ ఖర్గేను ఉదహరించారు. దళిత నేత మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మార్చుకుందని వివరించారు. ఆయనకు ఎమ్మెల్యేగా, ఎంపీగా పలుమార్లు అవకాశం కల్పించిందని చెప్పారు. నలుగురు కాంగ్రెస్ సీఎంలలో ముగ్గురు ఓబీసీ వారేననీ గుర్తు చేశారు.
Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన సీతక్కను సీఎం చేస్తుందని వివరించారు. కానీ, ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించబోదని స్పష్టం చేశారు. కర్ణాటకలోనూ ఇది గమనించవచ్చునని చెప్పారు.