
కాంగ్రెస్ మాజీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారు. ఈ విషయం దాదాపుగా ఖరారు అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర మహబూబ్ నగర్ లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం కొండావిశ్వేశ్వర్ రెడ్డి వెళ్లి బీజేపీ స్టేట్ చీఫ్ ను కలిశారు. వీరిద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. దాని కంటే ముందు ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డిని ఆయన ఇంట్లో విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరువురు దాదాపు రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు.
ఈ సమావేశం అనంతరం వీరిద్దరు కలిసి బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు సంభాషణలు జరిగాయి. ప్రజా సంగ్రామ యాత్ర చాలా చక్కగా సాగుతోందని ఈ సందర్భంగా కొండా కితాబిచ్చారని తెలుస్తోంది. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తోందని చెప్పినట్టు సమాచారం. ఇదే జోరును ఇక ముందు కొనసాగించాలని ఆయన చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. వీరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆయన బీజేపీ చేరడం ఇక ఖాయమే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
నేడు ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా మహబూబ్‌నగర్‌లో సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఆయన హాజరుకు ఒక రోజు ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల స్థానం నుంచి బీజేపీ టికెట్ హామీ ఇచ్చిందని సమాచారం. ఈ భేటీ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ చర్యల ను ఆధారంగా చేసుకునే తన చేరిక ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కమలం పార్టీ ఇంకా ఫామ్ లోకి వస్తే తెలంగాణలోని అనేక మంది నాయకులు ఆ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని ఆయన తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మే 14వ తేదీన తుక్కుగూడలో ముగియనుంది. ఈ సందర్భంగా అక్కడ సభ ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఆయనతో పాటు అలంపూర్ కు చెందిన మాజీ శాసన సభ్యుడు కూడా ఒకరు బీజేపీలో చేరుతారని సమాచారం.
బిజినెస్ మెన్ గా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ 20113 సంవత్సరంలో టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ తరఫున చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఒక్క సారిగా 2018 సంవత్సరంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2021 మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరకుండానే ఉన్నారు. కానీ గత కొంత కాలం నుంచి ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన బండి సంజయ్ ను కలవడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం పార్టీలో చేరడం ఇక లాంఛనమే అని స్పష్టమవుతోంది.