బ్యూటీషియన్ శిరీష పై అత్యాచారం జరగలేదు(వీడియో)

First Published Jul 7, 2017, 12:16 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం  సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా ఫొరెన్సిక్ నివేదిక పోలీసుల చేతికి అందింది. శిరీష పై అత్యాచారం జరగలేదని  ఫొరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. అయితే అత్యాచార యత్నం జరిగి ఉండొచ్చని ఫొరెన్సిక్ నివేదికను ఆధారంగా చేసుకుని పోలీసులు చెబుతున్నారు. ఫొరెన్సిక్ నివేదిక వెల్లడికావడంతో కీలకమైన చిక్కుముడి వీడిపోయింది.

శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫోరెన్సిక్ నివేదిక అందింది. శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో వెల్లడించారు. శిరీష డ్రెస్‌పై ఉన్న మరకలు ఆహారానికి సంబంధించినవి మాత్రమేనని తెలిపారు. బంధువుల అనుమానాలతో డ్రెస్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి, శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

 

శిరీష ఆత్మహత్య తర్వాత ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఈ వరుస సంఘటనల నేపథ్యంలో పోలీసులు అడ్డగోలుగా వ్యవహరించారు. అనేకసార్లు తప్పుడు సమాచారాన్ని లీకులు ఇచ్చి అభాసుపాలయ్యారు. ప్రభాకర్ రెడ్డి అత్మహత్య విషయంలో ఆయన శిరీష ను రేప్ చేశాడని, శిరీష ఆత్మహత్య చేసుకోవడంతో తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతోనే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు ఉన్నతాధికారులు లీకులు ఇచ్చారు. ఎస్సై మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి తరలించకముందే ఇలాంటి లీకులు ఇవ్వడంతో ఒక న్యూస్ చానల్ పోలీసుల వర్షన్ ఉన్నది  ఉన్నట్లు ప్రచారం చేసింది. దీంతో ఆగ్రహించిన ఎస్సై కుటుంబసభ్యులు కుకునూరుపల్లి స్థానికులు ఆ న్యూస్ చానెల్ లైవ్ వ్యాన్ ను  కాలబెట్టారు. అంతేకాకుండా శవాన్ని తరలించకుండా అడ్డుకుని నిరసన తెలిపారు.

 

ఎస్సై ఆత్మహత్య కేసులో కొందరు ఉన్నతాధికారులు అనుక్షణం కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ వసూళ్ల వేధింపుల భాగోతం ఎక్కడ బయటకొస్తుందోనన్న భయంతోనే అనేక రకాల కట్టుకథలు అల్లి మీడియాకు లీకులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. అందుకే జనాలు ఆగ్రహం చెంది వ్యాన్ తగలబెట్టడం, మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకోవడం చేశారని అంటున్నారు. ఇది చాలదన్నట్లు మళ్లీ ఆవేశంతో చేసిన వారిపై కేసులు పెట్టి సుమారు 40 మందిని జైలు పాలు చేశారు పోలీసులు.

 

తాజాగా శిరీష ఆత్మహత్య కేసులో ఆమెపై  అత్యాచారం జరగలేదని ఫొరెన్సిక్ నివేదిక వెల్లడించినందున ముందుగా లీకులు ఇచ్చిన పోలీసు బాసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నలు బాధిత ఎస్సై కుటుంబం నుంచి వినిపిస్తున్నాయి. ప్రభాకర్ రెడ్డి చనిపోయి రక్తపు మడుగులు ఆరకముందే ఆయన క్యారెక్టర్ పై బురద చల్లేందుకు ప్రయత్నించిన అధికారులకు ఎలాంటి శిక్షలు వేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఉన్నతాధికారుల వసూళ్ల వేధింపులు మరోవైపు శిరీష మరణం కేసును తనపై మోపి తనను ఉద్యోగంలోంచి తొలగిస్తారేమోనన్న భయంతోనే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్న మాట. ఎస్  ఐ భార్య రచనా రెడ్డి ఏమంటున్నారో చూడండి.

 

మొత్తానికి శిరీష కేసులో ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అన్న మిస్టరీ ఫొరెన్సిక్ నివేదిక రూపంలో తేలిపోయింది. అయితే శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఆమెది హత్య కాదని పోలీసులు పదేపదే చెబుతున్నారు అంటే ఈ రెండు విషయాల్లో క్లారిటీ వచ్చింది. కానీ శిరీష కుటుంబసభ్యులు మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే  ఉన్నారు. మరి శిరీష ఆత్మహత్య చేసుకుంది సరే దానికి ప్రధాన కారకుడైన రాజీవ్ ను తప్పించేందుకు కొందరు బిటి బ్యాచ్ రాజకీయ నాయకులు, కొందరు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి నిందితులపై ఉత్తుత్తి చర్యలుంటాయా? కఠిన చర్యలుంటాయా అన్నది సస్పెన్స్ గానే ఉంది.

click me!