అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ ఆగడాలు.. లా విద్యార్థినిపై అత్యాచారం, బలవంతంగా లైంగిక కార్యకలాపాలు...

By SumaBala BukkaFirst Published Dec 2, 2022, 1:19 PM IST
Highlights

ఓ లా విద్యార్థిపట్ల హాస్టల్ నిర్వాహకురాలు, అధికార పార్టీ ఎమ్మెల్యే దారుణానికి పాల్పడ్డారు. ఆమె మీద అత్యాచారం చేయడమే కాకుండా.. బలవంతంగా పలువురి దగ్గరికి పంపించారు. 

వరంగల్ : వరంగల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. మహిళల మీద మహిళలే దారుణాలకు, అకృత్యాలకు పాల్పడతున్నారు. అలాంటి ఓ ఘటన ఇది. హన్మకొండలో లా చదువుతున్న ఓ విద్యార్థినికి తేరుకోలేని అన్యాయం జరిగింది. డబ్బులకు ఆశపడి హాస్టల్ నిర్వాహకురాలు చేసిన పనితో ఆమె జీవితం  అగమ్యగోచరంగా మారింది. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల బాగోగులను చూసుకోవాల్సిన నిర్వాహకురాలు అత్యంత దారుణానికి తెగించింది. తన హాస్టల్లో ఉన్న విద్యార్థినిని తన పరిచయస్తుల కామవాంఛ తీర్చేందుకు వాడుకుంది. బాధితురాలిని బలవంతంగా వారి వద్దకు పంపించి దారుణంగా వ్యవహరించింది. డబ్బుకు ఆశపడి ఆమె చేసిన ఈ పనితో ఆ విద్యార్థిని కుంగిపోయింది.  

ఈ వేధింపులు ఎక్కువ అవుతుండడంతో ఆ విద్యార్థిని భరించలేకపోయింది. చివరికి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ దారుణమైన ఘటనలో ఓ ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ ఉండటం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. సిద్దిపేటకు చెందిన  ఓ విద్యార్థిని హన్మకొండలోని ప్రైవేటు లా కాలేజీలో ఎల్ఎల్బి నాలుగో సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వెళ్లి రావడానికి అనువుగా ఉంటుందని.. కాలేజీకి దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. ఈ హాస్టల్ ను వేముల శోభ అనే మహిళ నిర్వహిస్తుంది. ఆమె ఆ  విద్యార్థిని కుటుంబనేపథ్యం, ఆర్థిక స్థితి గమనించి..  బలవంతంగా  తనకు పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గరికి గత కొద్దిరోజులుగా పంపుతోంది. 

బాధితురాలు ఎంత అంగీకరించకపోయినప్పటికీ ఆమె బలవంతం ఎక్కువవుతుండడంతో భరించలేక రెండు రోజుల క్రితం హనుమకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వేముల శివ కుమార్ ఈ హాస్టల్ నిర్వాహకులు వేముల శోభకు మరిది అవుతాడు. అతను అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు ప్రైవేట్ పీఏగా కూడా పని చేస్తున్నాడు. అతనితో పాటు హనుమకొండ చౌరస్తా దగ్గర్లో మెడికల్ షాపు నడుపుతున్న కోటవిజయ్ కుమార్ అనే వ్యక్తి..  తన మీద అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు.

ఇంతటితో ఆగకుండా నగరంలోని అనేక చోట్లకు హాస్టల్ నిర్వాహకురాలు  వేముల శోభ తనను బలవంతంగా పంపించేదని ఆమె పేర్కొంది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభా,వేముల శివ కుమార్,  కోట విజయ్ కుమార్ లను గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ మేరకు హనుమకొండ ఏసిపి కిరణ్ కుమార్ వివరాలు తెలియజేశారు. శుక్రవారం  నిందితులను  రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల పంపిస్తామని అన్నారు.

click me!