
పత్తి రైతుల కూలీల సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ పూనుకుంది. విడతల వారీగా కాకుండా ఒకేసారి పత్తి సేకరించే విత్తనాలను అభివృద్ధి చేసింది. ఈ వంగడాలు నాటడం వల్ల ఒకే సారి పత్తిని సేకరించవచ్చు. దీంతో కూలీల సమస్యతో తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఈ విత్తనాలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే.. పత్తే సేకరించే యంత్రాల వినియోగం కూడా పెరగనుంది.
ఖర్చు తగ్గించాలనే..
తెలంగాణ రాష్ట్రంలో పత్తి ప్రధాన పంట. నీటి సౌకర్యం ఉన్న రైతులు వరి సాగు చేస్తుంటే.. ఎలాంటి నీటి సౌకర్యం అందుబాటులో లేని రైతులంతా దాదాపు పత్తినే సాగు చేస్తారు. ఈ ఏడాది 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. గత 15 ఏళ్లుగా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. గతంలో జొన్నలు, మినుములు, పెసర్లు, నువ్వులు, వరి, గోదుమాల వంటి పంటలు సాగు చేసే వారు. కొద్ది మొత్తంలో పత్తిని సాగు చేసేవారు. మార్కెట్లోకి బీటీ విత్తనాలు అందుబాటులోకి వచ్చాక పత్తి సాగు పెరిగింది. నీటి సౌకర్యం లేకపోయినా పండటం, కేవలం వర్షాధారంగానే దీనిని సాగు చేసే అవకాశం ఉండటం, తక్కువ భూసారం ఉన్న నేలలు, రాళ్ల నేళలోనూ దీనిని సాగు చేసే అవకాశం ఉండటంతో పత్తిని పండించే రైతులు పెరుగుతున్నారు. అయితే దీని సాగు ఖర్చు కూడా ప్రతీ ఏటా పెరుగుతోంది. విత్తనాల ధరలు, పురుగు మందులు, కలుపు మందులు, యూరియా, డీఏపీ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో పాటు కూలీల ధరలు, దుక్కి దున్నేందుకు ట్రాక్టర్ల ఖర్చులు కూడా పెరిగాయి. ఈ కారణాల వల్ల పత్తి సాగు భారంగా మారుతోంది. పత్తి సేకరించేందుకు కూలీలు కూడా సమయానికి దొరక్కపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటీ చెక్ పెట్టేందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. సాగు ఖర్చు తగ్గించి, కూలీల సమస్యలను అధిగమించేందుకు అనువైన విత్తనాలు రూపొందించింది.
నిధుల గోల్ మాల్ కేసులో కీలక మలుపు.. డబ్బు తిరిగి చెల్లించేందుకు అంగీకరించిన కెనరా బ్య
ప్రయోగాత్మకంగా అమలు..
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తయారు చేసిన విత్తనాలను తెలంగాణలోని పలు జిల్లాలో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇవి మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇవి అందరి రైతులకు అందుబాటులో వస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చు. ఇప్పడు రైతులంతా ఏడాదికి రెండు, మూడు సార్లు పత్తి సేకరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కూలీల ఖర్చు పెరిగిపోతోంది. అయితే ఈ విత్తనాలు నాటడం వల్ల ఒకే సారి పత్తి సేకరించవచ్చు. ప్రస్తుతం విదేశాల్లోనే ఉన్న పత్తి సేకరించే యంత్రాలు మన రాష్ట్రంలో కూడా అందుబాటులోకి వస్తాయి. దీంతో ఖర్చు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ విత్తనాలు నాటితే ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఆరునెలల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంటుందని, నీటి వసతి ఉన్న రైతులు రెండో పంట కూడా వేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ అంశం రైతులకు మరింత మేలు కల్గిస్తుంది.