
HYDERABAD: హైదారాబద్ లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ లిఫ్ట్ షాఫ్ట్‌లో పడి ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకెళ్తే.. రాజేంద్రనగర్‌లోని నిర్మాణంలో ఉన్న భవనంలోని మూడో అంతస్తు నుంచి ఓపెన్ లిఫ్ట్ షాఫ్ట్‌లోకి పడి ఐదేళ్ల బాలుడు గురువారం మృతి చెందాడు. బాలుడు, సుశాంత్ , గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే బిల్డింగ్ వాచ్‌మెన్ కొడుకు. చిన్నారి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆడుకుంటూ మూడో అంతస్తుకు వెళ్లింది. లిఫ్ట్‌కు డోర్ ఏర్పాటు చేయకపోవడంతో ఆడుకుంటుండగా గ్యాప్‌లో పడిపోయాడు. బాలుడికి పలు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.
మరో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి..
హైదరాబాద్ లోని చోటుచేసుకున్న మరో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ప్రణాలు కోల్పోయారు. పటాన్‌చెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ వద్ద ఎన్‌హెచ్-65పై శుక్రవారం కాంక్రీట్ వాహనం, డీసీఎం వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. డీసీఎంలో ప్రయాణిస్తున్న క్లీనర్‌తోపాటు ఇతర వ్యక్తులు తీవ్రంగా దెబ్బతిన్న వాహనంలో ఇరుక్కుపోవడంతో పోలీసులు వారిని బయటకు తీసేందుకు రెండు గంటల సమయం పట్టింది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి గుర్తింపులు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
మరో ఘటనలో సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివ్వంపేట వంతెన వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఎన్‌హెచ్-161పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అనంతరం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్ ఘోర ప్రమాదంలో 15 మంది మృతి
మధ్యప్రదేశ్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏకంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వివరాల్లోకెళ్తే.. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 530 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో బస్సు ప్రమాదానికి గురై కనీసం 15 మంది మరణించినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రమాద సమయంలో బస్సు లో చాలా ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.
వరుస ట్వీట్లలో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఘటన వివరాలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కూడా పంచుకున్నారు. "రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్వింగ్‌లో ఉంది" అని ఆయన చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ మరణించిన వారి కుటుంబానికి ₹ 2 లక్షలు, గాయపడిన వారికి ₹ 50 వేలు పరిహారం ప్రకటించారు . "బాధిత కుటుంబాలకు నా సానుభూతి" అని ఆయన హిందీలో ఒక ట్వీట్ చేశారు. కాగా, బస్సులో ఉన్న వారందరూ ఉత్తరప్రదేశ్ నివాసితులుగా భావిస్తున్నారు" అని రేవా పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ భాసిన్ ఇంతకు ముందు పేర్కొన్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. గాయపడిన 40 మందిలో 20 మందిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. బస్సు హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్తోందని ఆయన అన్నారు. మరణాలకు సంతాపం తెలుపుతూ మధ్యప్రదేశ్ హోం మంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ ఈ దుర్ఘటన బాధాకరమని అన్నారు.