అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.
వనపర్తి: వనపర్తి జిల్లాలో సోమవారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బళ్లారి నుండి హైద్రాబాద్ కు కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించిన తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుండి హైద్రాబాద్ కు వస్తున్న కారు వేగంగా చెట్టును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. సోమవారం నాడు తెల్లవారుజామున రెండున్నర గంటల నుండి మూడు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో 13 మంది ప్రయాణీస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహలను వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
అతివేగం, నిర్లక్ష్యం, నిద్ర మత్తు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బెంగుళూరు-హైద్రాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రాంతంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిద్రమత్తే రోడ్డు ప్రమాదాలకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు నమోదౌతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.