తెలంగాణ : మార్కులు తగ్గాయని, ఫెయిల్ అయ్యామని.. ఇప్పటి వరకు ఐదుగురు ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య

By Siva KodatiFirst Published Jun 28, 2022, 6:47 PM IST
Highlights

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడిన రోజే వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని ఐదుగురు ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. 
 

తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులు ప్రాణాలు తీసుకుంటున్నారు . మార్కులు తక్కువ వచ్చాయని కొందరు... పాస్ అవ్వలేదని మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. హైదరాబాద్ చింతల్ బస్తీకి చెందిన ఇంటర్ విద్యార్ధి గౌతమ్ కుమార్ పాసయ్యాడు. కానీ మార్కులు అనుకున్న దానికంటే తక్కువ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ ఆవేదనతోనే ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు సైఫాబాద్ పోలీసులు. నగర శివార్లలోనే కాటేదాన్ లోనూ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన విద్యార్ధి బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

ఇకపోతే.. తెలంగాణ ఇంటర్ ఫలితాలు (telangana inter results 2022) మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి (sabitha indra reddy) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు.  

ఫలితా విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67. 82 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టుగా చెప్పారు. ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో, హన్మకొండ సెకండ్ ప్లేస్‌లో నిలిచాయని వెల్లడించారు. ఈ నెల 30 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టుగా చెప్పారు. ఆగస్టు ఒకటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు  నిర్వహించనున్నట్టుగా తెలిపారు. ఆగస్టు చివరినాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in‌లోకి వెళ్లి ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. అక్కడ ఇంటర్ ఫస్టియర్/సెకండియర్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్‌ షీట్‌ను ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

click me!