
తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు , రాష్ట్రంలోనూ భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. భద్రాచలం వద్ద 44.5 అడుగుల మేర గోదావరి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం గోదావరిలో 7 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వరద నీరు వస్తున్నట్లు అంచనా. వరద ప్రవాహం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.
మరోవైపు భద్రాచలంలో వరద నీరు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సమీపం వరకు చేరుకుంది. పడమటి మాడవీధిలో వున్న దుకాణాలతో పాటు అన్నదాన సత్రం నీటమునిగింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని హెచ్చరించారు. అటు బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది. ఆఫీసులు, కంపెనీలు సైతం దీని ప్రకారమే పనివేళలను సరి చేసుకోవాలని సూచించింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ALso Read: హైదరాబాద్ కు రెడ్ అలర్ట్.. రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
హైదరాబాదుకు ప్రత్యేకించి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. జోన్లవారీగా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను అలర్ట్ చేసింది జిహెచ్ఎంసి. హైదరాబాదులోని చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక కుకట్పల్లి జోన్ కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. కూకట్పల్లి జోన్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గంటలో మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసే సూచనలు ఉన్నాయని కొన్నిచోట్ల ఐదు నుంచి పది సెంటీమీటర్లు కూడా వర్షం కురవచ్చని.. అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వర్షంతో పాటు భారీగా గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు.. హైదరాబాదులోని నాలాల కెపాసిటీ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునే వరకు మాత్రమే ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగా భారీ వర్షాలు కురిస్తే రోడ్లపైకి నీరు భారీగా చేరుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.