
హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ గా ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. హీరోలకు తానేమీ తక్కువ కాదంటూ దశాబ్ధ కాలంపాటు వెండితెరపై రాజ్యమేలారు. సినిమాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్నారు ఆమె లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.
ఒక ఉద్యమకారినిగా, రాజకీయ నేతగా తెలంగాణ ప్రజల మన్నలను పొందిన ఆమె రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు కాంగ్రెస్ పార్టీలో స్థిరపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన ఆమె అనంతరం పార్టీలో స్తబ్ధుగా ఉండిపోయారు.
తనకు తగిన పదవి ఇవ్వలేదంటూ ఆమె అలిగి కూర్చున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు వరకు అలక వీడలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించిన సమయంలో కూడా కనుచూపు మేరలో కనబడలేదు.
విజయశాంతి రాజకీయ అనుభవం, సినీ గ్లామర్ పార్టీకి ఎంతో కలిసి వస్తుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతి డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో స్టార్ కాంపైనర్ పదవి కట్టబెట్టింది. దాంతో ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ కాంపైనర్ గా ఉన్న ఆమె పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ గా ప్రమోషన్ సైతం పొందారు. ఆ నాటి నుంచి నేటి వరకు విజయశాంతి అవకాశం ఉన్నప్పుడల్లా తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలను తూర్పారబడుతూనే ఉంది.
ఇకపోతే జాతీయ రాజకీయాల్లో బీజేపీని సైతం ఉతికి ఆరేస్తోంది. అన్నయ్యా అంటూనే దొర అంటూ, ఫామ్ హౌస్ అంటూ విరుచుకుపడుతోంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని అరెస్ట్ సైతం అయ్యారు ఫైర్ బ్రాండ్ విజయశాంతి.
తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో ఆమె సిల్వర్ స్క్రీన్ పై దృష్టిసారించారంటూ ప్రచారం జరుగుతోంది. 12ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకోనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు అత్తగా నటిస్తున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 12 ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబుతో కలిసి నటించే అవకాశం రావడంతో ఆమె యాక్టింగ్ చేసేందుకు అంగీకరించారని ప్రచారం జరుగుతంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మహర్షి సినిమా పూర్తి చేశారు. ఆ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా, రష్మీక మందన హీరోయిన్ గా ఓ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆసినిమాలో మహేశ్ బాబుకు అత్తగా విజయశాంతిని నటించాలని దర్శకుడు అనిల్ రావిపూడి సంప్రదించాడని తెలుస్తోంది.
మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు తల్లిగా నటించిన విజయశాంతి ఇప్పుడు అత్త పాత్రలో కనువిందు చేయబోతుందన్నమాట. ఇకపోతే విజయశాంతి సినీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీపై కాంగ్రెస్ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉద్దండులు ఉన్నప్పటికీ స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఇంటర్ ఫలితాల అవకతవకలు, ఇంటర్ విద్యార్థుల మరణాలు, మహిళలపై అఘాయిత్యాలు వంటి ఘోరాలను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ వసార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాలను బీజేపీ చేజిక్కుంచుకుందని చెప్పుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీబిజీ అయితే కాస్త ఇబ్బందేమోనని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించడం వల్ల ఆమె ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉందని అది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశంగా కొందరు భావిస్తున్నారు.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన జగ్గారెడ్డి మాత్రం విజయశాంతి పార్టీకి మరింత సమయం కేటాయిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్తున్నారు. మరి విజయశాంతి నిర్ణయం ఎలా ఉండబోతుందో అన్నది సస్పెన్షన్. ఒకవేళ విజయశాంతి రీ ఎంట్రీకి ఒకే చెప్తే జూన్ నెల నుంచి షూటింగ్ లలో బిజీ కాబోతున్నారన్నమాట.