వదంతులు నమ్మెుద్దు, ప్రాణ నష్టం జరగలేదు: సీపీ అంజనీకుమార్

By Nagaraju TFirst Published Jan 30, 2019, 9:56 PM IST
Highlights

ప్రమాదంపై పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పందించారు. ప్రమాదంపై వదంతులు నమ్మెుద్దని కోరారు. స్వల్ప తొక్కిసలాటే జరిగిందని ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. 

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 10 ఫైరింజన్లు రంగంలోకి దించారు జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు.

నుమాయిష్‌ ఎగ్జిబిషన్ జరుగుతుండటం సాయంత్రం వేళ కావడంతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. అంతా కొనుగోలులో బిజీబిజీగా ఉన్న సందర్భంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పలు స్టాల్స్‌ నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. 

దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొలుత ఎగ్జిబిషన్‌ కి ఎదురుగా ఉన్న స్టాల్‌లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. నుమాయిష్ లో ఏర్పాటు చేసిన ఆంధ్రాబ్యాంక్ స్టాల్స్ లో మంటలు చెలరేగినట్లు సందర్శకులు చెప్తున్నారు. 

ఆ స్టాల్ నుంచి మంటలు భారీగా ఎగసిపడటంతో పక్కనే ఉన్న స్టాల్స్ కూడా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. 

ప్రమాదం జరిగిన వెంటనే సందర్శకులు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా సందర్శకులు రోడ్డుపైకి రావడంతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 

భారీగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో సందర్శకులు మెట్రోలో టికెట్‌ లేకున్న ప్రయాణం చేయవచ్చని మోట్రో రైలు ఎండీ ఎన్వీస్‌ రెడ్డి స్పష్టం చేశారు. అటు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు మెట్రో సర్వీసులను కూడా వేగంగా నడుపుతున్నారు.

మరోవైపు ప్రమాదంపై పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పందించారు. ప్రమాదంపై వదంతులు నమ్మెుద్దని కోరారు. స్వల్ప తొక్కిసలాటే జరిగిందని ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. 

పది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు సీపీ అంజనీకుమార్. 
 

click me!