నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం: భయంతో పరుగులు, తొక్కిసలాట

By Nagaraju TFirst Published Jan 30, 2019, 9:15 PM IST
Highlights

అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఒక స్టాల్స్ నుంచి మరో స్టాల్స్ ఇలా మెుత్తం క్షణాల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.   మంటలు ఎగిసిపడటంతో సందర్శకులు పరుగులు తీశారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడంతో తొక్కిసలాట కూడా జరిగిందని తెలుస్తోంది. 

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిస్ సంస్థ ఎగ్జిబిషన్ నిర్వహించింది. అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో పలు స్టాల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. 

అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఒక స్టాల్స్ నుంచి మరో స్టాల్స్ ఇలా మెుత్తం క్షణాల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సాయంత్రంవేళ కావడంతో ఎగ్జిబిషన్ కు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. మంటలు ఎగిసిపడటంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. పరుగులు తియ్యడంతో సందర్శకుల మధ్య తొక్కిసలాట కూడా జరిగిందని తెలుస్తోంది. 

ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక్క ఫైరింజన్ ఉండగా అదనంగా మరో మూడు ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. 

మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జిబిషన్ తిలకించేందుకు వచ్చిన సందర్శకులను పోలీసులు జాగ్రత్తగా బయటకు పంపించి వేశారు. 

జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నా అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది. ఒక స్టాల్ నుంచి మరోస్టాల్ కి మంటలు వ్యాపిస్తున్నాయి. 

ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో పక్కనే ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కనే గుడిసెలు వేసుకుని కొందరు స్థానికులు నివసిస్తున్నారు. ఆ గుడిసెలకు మంటలు వ్యాపిస్తాయేమోనని వారంతో ఆందోళన చెందుతున్నారు. 

ఇకపోతే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆంధ్రాబ్యాంక్ స్టాల్స్ నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ స్టాల్స్ లోనే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.  
 

click me!