
జగిత్యాల: అర్థరాత్రి మంటలు చెలరేగి ఓ షాపింగ్ మాల్ మొత్తం కాలిబూడిదైన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలో ఆనంద్ షాపింగ్ మాల్ ప్రముఖ వ్యాపార కేంద్రం. అయితే సోమవారం రాత్రి ఈ షాపింగ్ మాల్ లోని అన్ని షాప్ లు మూసేసిన తర్వాత అర్ధరాత్రి ఒక్కసారిగా మంటల చెలరేగాయి. అయితే చాలాసేపటి తర్వాత ఈ మంటలను స్థానికులు గుర్తించారు. అప్పటికే మంటలు ఎగసిపడుతూ షాపింగ్ మాల్ మొత్తాన్ని వ్యాపించాయి.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాలుగు అంతస్తులకు ఎగబాకిన మంటలను అదుపుచేసేవరకే సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేయడం కోసం అగ్నిమాపక సిబ్బంది కూడా కష్టపడాల్సి వచ్చింది.
రాత్రి 3గంటల సమయంలో షాపింగ్ మాల్ లో మంటలు వ్యాపించాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగకున్నా భారీగా ఆస్తినష్టం జరిగింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటల్లో తమ షాప్ లు పూర్తిగా కాలిబూడిద అవడంతో యజమానులు లబోదిబోమంటున్నారు. భారీగా ఆస్తినష్టం జరగడం తమకు కోలుకోలేని దెబ్బ అని... ప్రభుత్వం తమకు సహకారం అందించాలని వారు కోరుతున్నారు.