
హైదరాబాద్: ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పాతబస్తీ చార్మినార్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా వుండే లాడ్ బజార్ లోని రెండస్తుల భవనంలో మంటలు చెలరేగి ఓ బట్టల దుకాణ కాలిబూడిదయ్యింది. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని పాతబస్తీలో ప్రాచీన కట్టడం చార్మినార్ ను చూసేందుకు తెలుగురాష్ట్రాల నుండేకాదు దేశంలోని అన్నిప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు. కేవలం చార్మినార్ ను చూడటమే కాదు దాని చుట్టుప్పల ప్రాంతాల్లో షాపింగ్ కూడా చేస్తుంటారు. దీంతో చార్మినార్ ప్రాంతంలో భారీగా షాప్ లు వెలిసాయి. ఇలా లాడ్ బజార్ లోని ఓ రెండస్తుల భవనంలోనూ బట్టల షాప్ నడుస్తోంది.
తాజాగా ఆ బట్టల షాప్ లో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి క్షణాల్లో షాప్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో షాప్ లోని బట్టలతో పాటు ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి.
అగ్నిప్రమాదంపై సమాచారం అందినవెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షాప్ లో ఏమీ మిగలకుండా కాలిపోయాయి.
ఈ అగ్నిప్రమాదం జరిగిన బట్టల షాప్ నుస్థానిక పోలీసులు పరిశీలించారు. షాప్ యజమని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని... ఆస్తి నష్టంతో పాటు ఇతర వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల ఇలాగే సికింద్రాబాద్ బోయిగుడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోయిగుడాలోని ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగి కొందరు కార్మికులు సజీవదహనం అయ్యారు. అగ్నిప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది కార్మికులు వుండగా కేవలం ఒక్కరు తప్పించుకుని 11 మంది సజీవదహనమయ్యారు.
బీహార్ రాష్ట్రంలోని చప్రా జిల్లా నుండి కార్మికులు ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి టింబర్ డిపోలోనే వుండేవారు. వీరు పనులన్నీ ముగించుకుని రాత్రి నిద్రపోయాక అర్థరాత్రి దాటిన తరువాత ఒంటిగంట ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో నిద్రలో వున్న కార్మికులు గుర్తించలేకపోయారు. చివరకు మంటలు దావానంలా వ్యాపించడంతో తప్పించుకోవడం సాధ్యపడకు కార్మికులంతా సజీవదహనం అయ్యారు.