హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. బెంగళూరుకు సీఎం కేసీఆర్.. మరోసారి దూరంగా..

Published : May 26, 2022, 09:50 AM IST
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. బెంగళూరుకు సీఎం కేసీఆర్.. మరోసారి దూరంగా..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ పర్యటనుకు రానున్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరుకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం మోదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనుండగా.. కేసీఆర్ అందుకు కొన్ని గంటల ముందే బెంగళూరు బయలుదేరి వెళ్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ పర్యటనుకు రానున్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరుకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం మోదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనుండగా.. కేసీఆర్ అందుకు కొన్ని గంటల ముందే బెంగళూరు పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్.. నేడు బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారనే ప్రచారం సాగుతుంది. ప్రధాని మోదీకి స్వాగతం పలకాల్సి వస్తుందనే కేసీఆర్‌ రాష్ట్రంలో ఉండటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి.. ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సి ఉంది. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలకడం ఇష్టం లేకనే బెంగళూరు వెళ్తున్నట్టుగా ప్రచారం విస్తృతంగా సాగుతుంది. మోదీ హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లాకే.. కేసీఆర్ బెంగళూరు నుంచి ఇక్కడికి చేరుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకన్నారు. ఇక, గతంలో మోదీ జీనోమ్ వ్యాలీకి మోదీ వచ్చిన సందర్భంలో కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ప్రధాని కార్యాలయమే సీఎం కేసీఆర్‌ను వద్దని చెప్పి సమాచారం ఇచ్చిందని... అందుకే వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. దీంతో అది పెద్ద చర్చనీయాంశం కాలేదు.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణ, ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో.. ఆయనకు స్వాగతం పలికేందుకు కేసీఆర్ దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తుండగా.. కేసీఆర్ స్వాగతం పలికేందుకు దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య పరస్పరం విమర్శలకు దారితీసింది.

మధ్యాహ్నం హైదరాబాద్‌కు మోదీ.. స్వాగతం పలకనున్న మంత్రి తలసాని 
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకోనున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్,  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువరు స్వాగతం పలకనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2 గంటల సమయంలో ఐఎస్‌బీకు వెళ్లనున్నారు.

మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఐఎస్‌బీ కాన్వొకేషన్‌లో పాల్గొని సందేశమివ్వడంతోపాటు గ్రాడ్యుయేట్లకు గోల్డ్‌ మెడల్స్​, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో 35 నిమిషాలు ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హెచ్‌సీయూలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకుని.. 3.55కు ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరుతారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన‌‌‌ నేపథ్యంలో హైదరాబాద్‌‌‌‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌‌‌‌బీ ప్రాంగణాన్ని స్పెషల్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ (ఎస్‌‌‌‌పీజీ) ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది. ఐఎస్‌‌‌‌బీ పరిసరాల్లోని 5 కి.మీ. మేర బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నో ఫ్లై జోన్‌‌‌‌గా ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌‌లో అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. మరోవైపు గచ్చిబౌలి పరిసరాల్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో.. ఆయనకు ఘన స్వాగతం బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. బేగంపేట ఎయిర్ పోర్టు పార్కింగ్ ప్లేస్​లో స్వాగత సభ నిర్వహించేందుకు సభా వేదికను సిద్దం చేశారు. మరోవైపు హెచ్‌సీయూ పరిసరాల్లో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 
 

ఉదయమే బెంగళూరుకు కేసీఆర్..  
సీఎం కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కావడానికి ఈ రోజు ఉదయం బెంగళూరు వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి 10 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి 11 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి లీలా ప్యాలెస్‌‌‌‌ హోటల్‌‌‌‌కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 12.30కు బెంగళూరులోని పద్మనాభ నగర్‌‌‌‌లో మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరుకుంటారు. దేవెగౌడ, కుమారస్వామితో కలిసి లంచ్‌‌‌‌ చేస్తారు. అనంతరం వారితో పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. అయితే సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాతే కేసీఆర్ హైదరాాద్‌ చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా పలు అంశాలు ఈ సందర్భంగా నేతల మధ్య చర్చకు రానున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిని నిలబెట్టే అంశంలో చర్చలు జరపనున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కేసీఆర్.. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి పలువురు నేతలను కలిసిన విషయం తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?