తెలంగాణ మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్లు మాయం .. తొలుత తలసాని, ఆపై సబిత, ఆటో వదిలి పరారైన దుండగులు

By Siva Kodati  |  First Published Dec 9, 2023, 9:15 PM IST

తెలంగాణ మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్లు మాయమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.  మాసబ్ ట్యాంక్‌లో వున్న పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ అదృశ్యమయ్యాయి. బషీర్‌బాగ్‌లో వున్న విద్యా పరిశోధనా శిక్షణ సంస్ధలో ఫైల్స్ చోరీ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ ఆఫీసులో ఫైల్స్ మాయమైన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో వున్న పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ అదృశ్యమయ్యాయి. తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు కిటికీ గ్రిల్స్ తొలగించి ఆఫీసులోకి చొరబడి ఆపై ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఓఎస్డీ కళ్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేష్, ప్రశాంత్‌లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఓఎస్డీ కళ్యాణ్ ఆఫీసులో ఫైల్స్ మాయం కావడాన్ని శుక్రవారమే అధికారులు గుర్తించారు. దీనిపై తక్షణం సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. దీనిపై డైరెక్టర్‌ను ప్రశ్నించగా.. ఫైళ్లు మాయమైనట్లుగా ఎలాంటి సమాచారం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఫైళ్లు మాయమైన ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యలపై చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. మరోవైపు ఫైళ్లు మాయమైనట్లుగా వస్తున్న ఆరోపణలను ఖండించారు తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్. 

Latest Videos

undefined

ఈ వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని .. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తలసాని మంత్రిగా వున్నప్పుడు వచ్చిన ఫైళ్లను ఎప్పటికప్పుడు సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేశామని కళ్యాణ్ చెబుతున్నారు. ఫర్నిచర్ , ఇతర సామాగ్రిని జీఏడీ అధికారులకు అప్పగించేందుకే తాము మాసాబ్ ట్యాక్ కార్యాలయానికి వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. 

ఈ ఘటనను పక్కనబెడితే.. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో వున్న విద్యా పరిశోధనా శిక్షణ సంస్ధలో ఫైల్స్ చోరీ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. ఆటోలో ఫైల్స్ వేసుకుని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా.. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని అడ్డగించారు. దీంతో దుండగులు ఆటోను వదిలి పరారయ్యారు. అయితే ఈ విద్యా పరిశోధనా సంస్థ కార్యాలయంలోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ కూడా వుండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 

click me!