
FIFA World Cup projects in Qatar: ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌కప్ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తుండగా తెలంగాణకు చెందిన నలుగురు కార్మికులు మరణించారు. అయితే, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి అరబ్ దేశం నిరాకరించిందని తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఒకరు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే.. ఖతార్ లో ఫిఫా వరల్డ్‌కప్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో పలువురు తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుని ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
దీనిపై స్పందించిన చేవెళ్ల నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు రంజిత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు విజ్ఞప్తి చేస్తూ.. ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ ప్రాజెక్టు పనుల్లో పనిచేస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఖతార్ నుంచి నష్టపరిహారం ఇప్పించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని చేశారు. "దోహాలో ఫిఫా ప్రపంచ కప్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికుల జీవితాలు చాలా చౌకగా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ.. ఫిఫా ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్నప్పుడు మరణించిన వారికి పరిహారం చెల్లించడానికి ఖతార్ నిరాకరించింది. వలస తెలంగాణ కార్మికుల శవాలపై దోహా ఫిఫా ప్రపంచ కప్ నిర్వహించాలనుకుంటున్నారా?’’ అని రంజిత్ రెడ్డి ప్రశ్నించారు.
మల్లాపూర్ గ్రామానికి చెందిన జగన్ సూరుకంటి, ధర్పల్లికి చెందిన మాజిద్, మెండోరా గ్రామానికి చెందిన మధు బొల్లాపల్లి, వెల్మల్‌కు చెందిన కల్లాడి రమేష్ ఖతార్ లోని దోహా ఫిఫా వరల్డ్ కఫ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తూ మరణించారని రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. "వారికి ఎటువంటి పరిహారం లభించలేదు. ఆశ్చర్యకరంగా దోహాలోని భారత రాయబార కార్యాలయానికి మరణాల గురించి సమాచారం లేదని చెప్పారు. తెలంగాణ నుండి వచ్చిన ఈ వలస కార్మికులకు ఎవరు న్యాయం చేస్తారు" అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమ మోడీ, విదేశాంగ మంత్రికి జై శంకర్ లు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, 2022 FIFA ప్రపంచ కప్ నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు ఖతార్‌లో జరగాల్సి ఉంది. ఆతిథ్య దేశం ప్రపంచకప్‌కు సన్నాహాల్లో పాల్గొన్న విదేశీ కార్మికుల పట్ల ఇలా దారుణంగా వ్యవహరించినందుకు విమర్శలను ఎదుర్కొంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిర్బంధ కార్మికులు, పేద పని పరిస్థితులను ప్రస్తావించింది. అక్కడి పరిస్థితులు కార్మికులకు దారుణంగా ఉన్నాయని పేర్కొంది.