ఆస్తి కోసం.. కన్న కొడుకును గొడ్డలితో మెడ నరికి చంపిన తండ్రి...

By Bukka SumabalaFirst Published Sep 10, 2022, 11:16 AM IST
Highlights

ఆస్తికోసం ఓ తండ్రి దారుణానికి తెగించాడు. తను పంపిన డబ్బులు ఏమయ్యాయని అడిగాడని కొడుకును మెడనరికి చంపేశాడు. 

నిజామాబాద్ : ఆస్తి విషయంలో జరిగిన వాగ్వాదంలో ఆవేశానికి లోనైన ఓ తండ్రి కన్నకొడుకునే కర్కశంగా కడతేర్చాడు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరా గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీలో గురువారం రాత్రి ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న దండ్ల సుమన్ (25) ఇటీవల దుబాయ్ కి వెళ్లి తిరిగివచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి తండ్రి పెద్ద రమేష్తో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. తాను గల్ఫ్ లో ఉండగా పంపిన డబ్బులు  ఏమయ్యాయి? తన భార్యకు ఎందుకు ఇవ్వలేదు? ఆస్తి పంచి ఇవ్వాలంటూ సుమన్ ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో తండ్రిని నిలదీశాడు.

అయినా తండ్రి రమేష్ స్పందించలేదు. వినాయక నిమజ్జనం తర్వాత గురువారం అర్ధరాత్రి దాటాక సుమన్ తండ్రి ఇంటికి వచ్చాడు. అక్కడున్న తన ద్విచక్ర వాహనాన్ని తీసుకు వెళ్లడం కోసం వెళ్ళాడు.  ఆ సమయంలో అక్కడ గొడవ జరిగింది. ఈ గొడవతో ఉద్రేకానికి లోనైన తండ్రి పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని పలుమార్లు బలంగా  నరకడంతో సుమన్ మెడ సగభాగం తెగిపోయింది. దీంతో రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతిచెందాడు. 

సిద్దిపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..

రక్తపు మరకలని నీటితో కడిగేసి తండ్రి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆర్మూరు ఆస్పత్రికి తరలించారు. సుమన్ కు భార్య, ఐదు నెలల బాబు ఉన్నారు.  ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వివరించారు.

ఇదిలా ఉండగా, మద్యం మత్తులో కన్న కొడుకునే హత్య చేశాడో కన్నతండ్రి. ఈ ఘటన ఆత్మకూరు పట్టణంలో జూన్ 9న చోటుచేసుకుంది. ఆత్మకూరులోని వెంగళరెడ్డి నగర్ లో పని చేసుకుని జీవించే తండ్రీకొడుకులు హసన్ పీరా (70), మౌలాలి (25)మద్యానికి బానిసలై తరచూ గొడవ పడేవారు. బుధవారం మధ్యాహ్నం మౌలాలి నిద్రిస్తుండగా మద్యం తాగి వచ్చిన తండ్రి హసన్ పీరా మౌలాలిపై కత్తి పీటతో దాడి చేశాడు. 

దీంతో గొంతు తెగి... తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న మౌలాలిని స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా మౌలాలిని కర్నూలుకు తీసుకువెడుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు డిఎస్పి శృతి, సీఐ సుబ్రహ్మణ్యం పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హసన్ పీరా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 
 

click me!