
జగిత్యాల: తెల్లవారితే పెళ్ళి... ఓవైపు పెళ్ళివంటలు చేయడం కూడా ప్రారంభమయ్యింది... మండపం కూడా సర్వాంగసుందరంగా రెడీ అయ్యింది. మరోవైపు బంధువులు, ఇళ్ళంతా కోలాహలంగా వుంది. ఇలాంటి ఆనంద సమయంలో పెళ్లికొడుకు తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్ళిబాజా మోగాల్సిన ఇంట్లో చావుబాజా మోగింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల పట్టణంలో ఆర్ఎన్టీ నగర్ కు చెందిన బందెల ఆంజనేయులు ఆర్టీసి డ్రైవర్. ఇతడి కొడుకు పెళ్లి ఇవాళ(ఆదివారం) జరగాల్సి వుంది. పెళ్లికోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే ఇవాళ తెల్లవారుజామున పెళ్ళి కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆంజనేయులు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
దీంతో పెళ్లితంతును నిలిపివేసిన కుటుంబసభ్యులు అతడిని సమీపంలోని హాస్పిటల్ కు తకలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీంతో ఆనందోత్సాహాలతో కోలాహలంగా వుండాల్సిన పెళ్లివారిల్లు చావు ఏడుపుతో విషాదంగా మారింది.
అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి ఆనందంగా కొత్తజీవితాన్ని ప్రారంభించాల్సిన యువకుడు ధు:ఖసాగరంలో మునిగి తండ్రికి చితిచూట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా పెళ్లిమండపంలో బంధుమిత్రుల మధ్య కొడుకూ, కోడలి పెళ్లిలో ఆనందంగా వుండాల్సిన ఆంజనేయులు స్మశానంలో ఒంటరిగా మిగిలిపోయాడు.
గత సంవత్సరమే ఆంజనేయులు చిన్న కొడుకు ఎస్సారెస్పీ కాలువలో పడి మృతిచెందాడు. ప్రమాదకరంగా సెల్పీ దిగడానికి ప్రయత్నించిన యువకుడు కాలుజారి కాలువలో పడిపోయి మృతిచెందాడు. ఈ బాధనుండి ఇప్పుడిప్పుడే కోలుకుని పెద్దకొడుకు పెళ్లి చేస్తుండగా ఆంజనేయులు మృతిచెందడంతో ఆ కుటుంబానికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది.