
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ (sonia gandhi) తనయుడు రాహుల్ గాంధీ (rahul gandhi) పై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (himanta biswa sarma)పై ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎవరికి పుట్టాడంటూ అసోం సీఎం (assam cm) కళ్లు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడాడని... అలాంటి వ్యక్తికి సీఎంగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. వెంటనే హిమంతు బిశ్వను సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలని కేసీఆర్ బిజెపి (bjp) అధినాయకత్వాన్ని సూచించారు.
సీఎం కేసీఆర్ తనపై చేసిన విమర్శలపై తాజాగా అసోం సీఎం హిమంత శర్మ ఘూటుగా స్పందించారు. ఇదే రాహుల్ గాంధీ దివంగత భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ (bipin rawat) మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేసారని... అప్పుడేమయ్యారని కేసీఆర్ ను ప్రశ్నించారు. శతృదేశం పాకిస్థాన్ పై చేసిన సర్జికల్ స్ట్రైక్ పై రాహుల్ వ్యాఖ్యలు చేసారని... అలాంటి వ్యక్తి గురించి తాము మాట్లాడకూడదా? అని అసోం సీఎం తెలంగాణ సీఎంను నిలదీసారు.
గాంధీ కుటుంబం ఏం మాట్లాడినా చెల్లుతుంది... కానీ ఆ కుటుంబంపై ఎవ్వరూ విమర్శలు చేయకూడదా? అని హిమంతు శర్మ ప్రశ్నించారు. కేసీఆర్ కు కేవలం తాను మాట్లాడిందే తప్పుగా అనిపించిందా? అని అసోం సీఎం హిమంత బిశ్వ నిలదీసారు.
శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంతు బిస్వ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసారు. రాహుల్ ఎవరికి పుట్టాడంటూ దిగజారి వ్యాఖ్యలు చేయడం సీఎం స్థాయి వ్యక్తికి తగదంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
దేశానికి ప్రధానులుగా సేవలందించిన జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల మనవడు, రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీపై అసోం సీఎం వ్యాఖ్యలు వింటే తనకు కళ్లవెంట నీరు వచ్చాయని కేసీఆర్ అన్నారు. మీ పార్టీ నాయకులు మట్లాడే మాటలు ఇవా... ఇదేనా సంప్రదాయం? అని ప్రధాని మోదీ, బిజెపి చీఫ్ జెపి నడ్డాను కేసీఆర్ ప్రశ్నించారు.
ఇంకా భువనగిరి బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదరుతోందన్నారు. అందువల్లే మోడీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చిందంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు రైతుల్ని ఏడిపించారని... రైతుల్ని అవమానించారని, గుర్రాలతో తొక్కించారని సీఎం ఎద్దేవా చేశారు. చివరికి రైతుల మీదకి కార్లు కూడా ఎక్కించారని దుయ్యబట్టారు.
మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి కరెంట్ సంస్కరణ పేరుతో మీటర్లు పెట్టించిందని సీఎం ఆరోపించారు. మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం లేకుంటే ఇవ్వబోమంటోందని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని తరిమి తరిమి కొట్టాలని సీఎం పిలుపునిచ్చారు.