ఫస్టాగ్ కేటుగాళ్లు: టోల్ ఫీజు ఎలా ఎగ్గొడుతున్నారంటే....

By Sree sFirst Published Jun 7, 2020, 8:46 AM IST
Highlights

అక్రమాలకు, మోసాలకు కాదేది అనర్హం అన్నట్టుగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా వచ్చిన ఫస్టాగ్ ని కూడా బురిడీ కొట్టిస్తూ టోల్ చార్జీల ఎగవేతకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. వీరి మోసాలు తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు దీనిపై అప్రమత్తుమయ్యారు. 

అక్రమాలకు, మోసాలకు కాదేది అనర్హం అన్నట్టుగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా వచ్చిన ఫస్టాగ్ ని కూడా బురిడీ కొట్టిస్తూ టోల్ చార్జీల ఎగవేతకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. వీరి మోసాలు తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు దీనిపై అప్రమత్తుమయ్యారు. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలకు అవి ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ రుసుమును వసూలు చేస్తారు. మామూలుగా మిగిలిన టోల్ బూతుల్లో దూరం ఆధారితంగా ఉండదు. దూరంతో సంబంధం లేకుండా నిర్దేశిత రుసుమును వసూలు చేస్తారు. దేశంలో కేవలం ఔటర్ రింగ్ రోడ్డుపై మాత్రమే ఇలా దూరం ఆధారంగా ఛార్జ్ లను వసూలు చేసే క్లోజ్డ్ టోల్ పాలసీ అమల్లో ఉంది. 

అయితే ఇక కేటుగాళ్లు దీన్ని ఆసరాగా చేసుకొని టోల్ వసూలుదారులకు చార్జీలను ఎగ్గొడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే కేటుగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వదులుకోరు అన్న విషయం మనకు అర్థమవుతుంది. 

సాధారణంగా ఫాస్టాగ్‌ కలిగిన వాహనదారులు ఔటర్‌పైకి ప్రవేశించగానే ఆరెజ్‌ రంగు లేన్‌లో వెళ్తే రీడింగ్‌ ప్రారంభమవుతుంది. ఔటర్‌పై నిష్క్రమించేటప్పుడు అదే ఆరెంజ్‌ రంగు లేన్‌లో ఎగ్జిట్ అయితే ప్రయాణించిన దూరానికి అనుగుణంగా వాహనదారుడి ఖాతా నుంచి డబ్బులు కట్‌ అవుతాయి.

కానీ కేటుగాళ్లు మాత్రం అతి తెలివిని ప్రదర్శిస్తూ.... ఔటర్ పైకి ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్ ఇచ్చే బ్లూ లైన్(ఫస్టాగ్ లేని వాహనాలు మాత్రమే ఎంటర్ అయ్యే లైన్)  లో ఎంటర్ అవుతున్నారు ఆ సమయంలో తమ వాహనాలకు ఉండే ఫస్టాగ్ ను దాచిపెడుతున్నారు. అక్కడ వారిచ్చే ఎంట్రీ టికెట్ ను జేబులో పెట్టుకుంటున్నారు. ఆ తరువాత ఎగ్జిట్ అప్పుడు మాత్రం బ్లూ లైన్ లో టికెట్ ఇచ్చి ఎగ్జిట్ అవకుండా ఫస్టాగ్ ఎగ్జిట్ అయిన ఆరంజ్ లైన్ లోనే ఎగ్జిట్ అవుతున్నారు. 

ఇలా ఎంట్రీ పాయింట్ లేకపోవడంతో ఎగ్జిట్ పాయింట్ ఒకటే నమోదవుతుండడంతో వారి ఫస్టాగ్ ఖాతాల్లోనుంచి నామమాత్రపు టోల్ ఫీజు మాత్రం కట్ అవుతుంది. (ఎగ్జిట్ అప్పుడు తిరిగి ఫస్టాగ్ ని అతికిస్తున్నారు)

ఇలా చేయడం వల్ల వారు ఎక్కడ ఎంట్రీ అయినా ఎగ్జిట్ అప్పుడు మాత్రం నామమాత్రపు రుసుమును మాత్రమే చెల్లించి టోల్ వసూలు సంస్థకు టోకరా ఇస్తున్నారు. 

తాజాగా ఇలానే ఒక వాహనదారుడు నానక్ రామ్ గూడా నుంచి ఘట్కేసర్ వరకు దాదాపుగా 75 కిలోమీటర్లు ప్రయాణించి కేవలం 70 రూపాయల నామమాత్రపు టోల్ రుసుమును మాత్రమే చెల్లించాడు. కేవలం ఔటర్ [పై మాత్రమే అందునా అధిక దూరాలు ప్రయాణం చేసే కేటుగాళ్లు మాత్రమే ఈ విధంగా టోపీ పెడుతున్నట్టు అక్కడి ప్రతినిధులు తెలిపారు. 

click me!