టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాళ్లపై పడ్డ అన్నదాత

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 8:05 AM IST
Highlights

మీరే న్యాయం చేయాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాళ్లపై పడ్డాడు ఓ రైతు.

కరీంనగర్: తన కుటుంబానికి ఆధారమైన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకుని తనను బెదిరిస్తున్నారు... మీరే న్యాయం చేయాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాళ్లపై పడ్డాడు ఓ రైతు. కబ్జాధారుల నుండి తన భూమిని తిరిగి ఇప్పించాలని బాధిత రైతు ఎమ్మెల్యేను వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో చోటుచేసుకుంది. 

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన నియోజకవర్గ పరిధిలోని తాడికల్ గ్రామానికి విచ్చేశాడు. ఈ  క్రమంలోనే ఆదెపు నర్సయ్య అనే రైతు ఎమ్మెల్యేకు తన గోడును తెలియజేస్తూ ఒక్కసారిగా ఆయన కాళ్లపైపడి న్యాయం చేయాలని వేడుకున్నాడు. 

''శంకరపట్నం మండలం ముత్తారం గ్రామ పరిధిలోని 2.5 ఎకరాల భూమిని 2010లో కొనుగోలు చేశాను. ఈ  భూమిని తనపేరిట రిజిస్టర్ చేసుకోవడమే కాదు ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పాసుబుక్ ను కూడా ఇచ్చింది. అలాగే రైతుబంధు డబ్బులు కూడా నా ఖాతాలోనే పడుతున్నాయి''  అని రైతు ఎమ్మెల్యేకు తెలిపాడు. 

read more  విద్యుత్ ఉత్పత్తి ఆగదు.. ప్రాజెక్ట్‌ల వద్దకు ఎవరినీ అనుమతించొద్దు: అధికారులకు కేసీఆర్ హుకుం

''అయితే కొద్దినెలల కింద కొందరు తన భూమిని ఆక్రమించుకున్నారు... ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. తన భూమిలో అక్రమంగా వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. వారి నుండి భూమిని విడిపించి మీరే నాకు న్యాయం చేయాలి'' అంటూ రైతు నర్సయ్య ఎమ్మెల్యే రసమయిని వేడుకున్నాడు. 

బాధిత రైతు భూమికి సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యేకు చూపించాడు. దీంతో వెంటనే స్పందించిన రసమయి ఈ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. రైతును బెదిరించి అతడి భూమిని కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకొవాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశించారు. 
 

click me!