తన ఐదెకరాల పోడు భూమిని అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఓ ఆదివాసీ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్: తెలంగాణలో వరుసగా అన్నదాతల ఆత్మహత్య (telangana farmers suicide)లు కొనసాగుతున్నాయి. వరి వెయ్యొందన్నందుకు ఒకరు, గిట్టుబాట ధర దక్కక మరొకరు, ఆర్థిక కష్టాలతో ఇంకొకరు ఇలా ఇప్పటికే చాలామంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా పోడుభూముల వివాదం ఆదివాసీ రైతులు (tribal farmer) పొట్టనపెట్టుకుంది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా (adilabad district)లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం జీడిపల్లికి చెందిన లక్ష్మణ్(48) కు ఐదెకరాల పోడు భూమి వుంది. అందులోనే అతడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే పోడు భూములు కలిగిన రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించగా లక్ష్మణ్ దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరిట పట్టా వచ్చి ఐదెకరాలు తన సొంతం అవుతుందని భావించాడు.
కానీ అతడి ఆశలపై అటవీ శాఖ అధికారులు నీళ్లు చల్లారు. అతడి ఐదెకరాల భూమిని అటవీ భూమి (farest land)గా పరిగణిస్తూ అందులో నీటికుంట నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నిన్న(ఆదివారం)భూమిని స్వాధీనం చేసుకుని జేసిబిల సాయంతో నీటికుంట నిర్మాణాన్ని అటవీ అధికారులు చేపట్టారు.
Read More రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే : వైఎస్ షర్మిల
ఈ పనులను లక్ష్మణ్ అడ్డుకోడానికి ప్రయత్నించారు. తన భూమిని లాక్కుని కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దని అధికారులను వేడుకున్నాడు. అతడి ఆవేదనను పట్టించుకోకుండా అధికారులు పనులను కొనసాగించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన ఆదివాసీ రైతు దారుణానికి ఒడిగట్టాడు.
నీటి కుంట నిర్మాణ పనులు జరుగుతున్న భూమిలోనే లక్ష్మణ్ పురుగుల మందు (pesticide) తాగాడు. పక్కనే వున్నవారు దీన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు తీవ్ర అస్వస్థతకు గురయిన లక్ష్మణ్ ను బోథ్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో డాక్టర్ల సూచన మేరకు ఆదిలాబాద్ రిమ్స్ (adilabad RIMS) కు తరలించారు. అక్కడికి వెళ్లేసరికే పరిస్థితి పూర్తిగా విషమించి లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు.
గ్రామానికి చెందిన తోటి రైతు మృతితో జీడిపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన భార్య, ముగ్గురు పిల్లలు బోరున విలపిస్తున్నారు. వారి ఆవేదన ఇతరులను కూడా కన్నీరు పెట్టిస్తోంది. రైతు లక్ష్మణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, ఆదివాసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read More సీఎం సొంత జిల్లాలో మరో అన్నదాత ఆత్మహత్య... వైఎస్ షర్మిల ఆవేదన (Video)
అలాగే అమాయక ఆదివాసీ రైతు ఆత్మహత్యకు కారణమైన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే పోడు భూములకు పట్టాలిచ్చి ఆదివాసీ రైతులకు న్యాయం చేస్తామంటుంటే అటవీ అధికారులు ఇలా భూములను ఆక్రమించుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే రైతు ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే లక్ష్మణ్ వ్యవసాయ భూమిలో నీటికుంట నిర్మాణ పనులు ఆపేసామని బోథ్ అటవీ క్షేత్ర అధికారి సత్యనారాయణ చెప్పారు. రైతు లక్ష్మణ్ వచ్చి పనులను అడ్డుకోగానే ఆపేసామని తెలిపారు.
(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)