పొలంలో చలిమంట.. షెడ్డుకు మంటలంటుకుని రైతు సజీవదహనం..

By SumaBala Bukka  |  First Published Oct 12, 2022, 7:17 AM IST

చలిని తట్టుకోవడానికి పొలంలో వేసుకున్న చలిమంట ఆ రైతు పాలిట చితిమంట అయ్యింది. గాఢనిద్రలో ఉండగా.. నెగడు రగిలి షెడ్డుకు అంటుకోవడంతో రైతు సజీవదహనం అయ్యాడు. 



నిర్మల్ : చలి తీవ్రతను తట్టుకునేందుకు ఓ రైతు పొలంలో చలిమంట వేసుకున్నాడు. అదే అతనికి చితిమంట అయ్యింది.  నిర్మల్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.  భైంసా మండలం ఎగ్గాంకు చెందిన భూమన్న (70)..  పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఎప్పట్లాగే సోమవారం రాత్రి కూడా పొలానికి కాపలాగా వెళ్ళాడు. చలి అధికంగా ఉండడంతో పొలంలోని షెడ్డులో  చలిమంట వేసుకున్నాడు. దానికి పక్కనే మంచంపై పడుకున్నాడు.

అయితే అర్ధరాత్రి తర్వాత ఆ చలిమంట రగిలి.. షెడ్డుకు నిప్పు అంటుకుంది. షెడ్డులోని కట్టెలు, గడ్డి వంటివి అంటుకుని మంటలు వ్యాపించాయి. వాటిల్లోనే భూమన్న కూడా కాలిపోయాడు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం అటుగా వచ్చిన కొందరు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి భూమన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

Latest Videos

హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఇన్వెస్ట్‌మెంట్ స్కాం.. దేశవ్యాప్తంగా రూ.600 కోట్లు వసూలు

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్లో ఓ దొంగ వణికించే చలి నుంచి కాపాడుకోవడానికి  నివ్వెరపోయే పనిచేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి  దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. చాలా బైక్లను దొంగతనం చేసేవాడు. వాటన్నింటినీ ఒక చోట దాచి పెట్టేవాడు. నిరుడు డిసెంబర్లో చలి మామూలుగా లేదు.  ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా ఆ దొంగకు కూడా బాగా చలి వేసేసింది. చలిమంట వేసుకుందామని ఎంత వెతికినా కర్రముక్క లాంటివి ఏమీ కనిపించలేదు. ఓ వైపు చలి వణికిస్తోంది..  ఏం చేయాలో అర్థం కాలేదు… కళ్ళెదుట తాను దొంగతనం చేసి తీసుకొచ్చిన కనిపించాయి.

దాంట్లో ఒక దానికి  నిప్పంటించి చలికాచుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచన వచ్చింది.  అనుకున్నదే తడవుగా  ఆ బైక్ లో నుంచి ఒక బైక్  పక్కకు తీసుకొచ్చాడు.. దాని మీద కొంత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో చలి కాచుకున్నాడు. ఖరీదైన చలిమంట ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటుచేసుకుంది. ఆ బైక్ తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్నదైతే..  అంత సాహసం చేయకపోయేవాడు. దొంగతనం చేయడంతో తేరగా వచ్చిందని ఇంత ఘాతుకానికి తెగించాడు. ఈ ఘటన  కొద్దిరోజుల తర్వాత కానీ  వెలుగులోకి రాలేదు. అది కూడా  పోలీసులు  బైకు దొంగతనాల విషయంలో సీరియస్ గా దర్యాప్తు చేపట్టడంతో  ఆ దొంగను పట్టుకున్నారు. ఈ క్రమంలో వాహనాల గురించి ఆరా తీయగా విషయం బయటపడింది. ఈ అతి ఖరీదైన చలిమంట గురించి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు.

click me!