ఫ్రెండ్స్ చెప్పారని.. ఇంట్లోని 4 లక్షలు దోచేసిన 8,9 యేళ్ల చిన్నారులు.. వాటి స్థానంలో నకిలీ కరెన్సీ..!

By SumaBala BukkaFirst Published May 21, 2022, 6:45 AM IST
Highlights

ఓ ఇద్దరు చిన్నారులు ఇల్లు దోచేశారు. స్నేహితులు చెప్పారని ఏకంగా నాలుగు లక్షలు దోచేశారు. జల్సాలు చేస్తూ తిరిగారు. అసలు కరెన్సీ స్తానంలో నకిలీ కరెన్సీ పెట్టారు. 

జీడిమెట్ల :  తల్లిదండ్రులు ఇంట్లో దాచిన నాలుగు లక్షల రూపాయలు ఇరవై రోజుల్లో ఖర్చు చేశారు 9, 8 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులు. నెల రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన శుక్రవారం జీడిమెట్ల పరిధిలో వెలుగుచూసింది. ఎస్సార్ నగర్ కు చెందిన దంపతులు నెల కిందట ఏదో అవసరం రీత్యా నాలుగు లక్షల రూపాయలు తీసుకు వచ్చి ఇంట్లో పెట్టారు. ఇది ఇంట్లోని చిన్నారులు  గమనించారు. పిల్లల నోట్లో ఏ విషయమూ ఆగదు కదా.. అలా ఆడుకునే సమయంలో సమీపంలోని స్నేహితుల (13,14  యేళ్ళపిల్లలు)తో తమ ఇంట్లో డబ్బు ఉన్న సంగతి చెప్పారు. 

ఈ కాలం పిల్లలకు వయసుకు మించి ముదిరిపోయారు కదా.. అందుకే ఈ విషయం వినగానే వారి బుర్రల్లో ఏదో ఆలోచన వచ్చింది. అంతే వారిద్దరూ.. వీరిని ఏమార్చి ఇంట్లో నగదు కొంచెం కొంచెం తీసుకువచ్చేలా ప్రోత్సహించారు. వారు మభ్య పెట్టిన విషయాలకు ఈ చిన్నారులు కూడా తల్లీదండ్రి కొప్పడతారన్న భయం లేకుండా ఒప్పేసుకున్నారు. అలా కొద్దికొద్దిగా డబ్బులు తీసుకురావడం మొదలు పెట్టారు. తల్లిదండ్రులకు అనుమానం రాకుండా అసలు డబ్బుల స్థానంలో నకిలీ కరెన్సీ పెట్టేవారు. 

అలా తీసుకు వచ్చిన డబ్బుతో నలుగురూ కలిసి జల్సాలు చేస్తూ స్మార్ట్ ఫోన్లు లు, స్మార్ట్ వాచీలు కొనుక్కున్నారు.. గేమింగ్ సెంటర్ లు, రెస్టారెంట్ లకి వెళ్లారు. ఇంత జరుగుతున్నా తల్లిదండ్రులకు విషయం తెలిసిరాలేదు. ఇరవై రోజుల తర్వాత అవసరార్థం డబ్బును పరిశీలించిన తల్లిదండ్రులకు కొంచెమే కనిపించింది. గమనించగా అది కూడా నకిలీ కరెన్సీ అని తేలడంతో తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. ముందు దొంగలపని అనుకున్నారు. తరువాత తాము తెచ్చిన వాటిల్లో నకిలీ కరెన్సీ ఉందా అని అనుమానపడ్డారు.

చివరికి.. దేనికీ లాజిక్ దొరక్క పిల్లలను అడిగారు. అప్పటికి కానీ విషయం అర్థం కాలేదు. తాము స్వయంగా ఈ విషయాన్ని చిన్నారులను అడిగారు. మొదట భయపడ్డ చిన్నారులు ఆ తరువాత జరిగిన విషయం వివరించారు. దీంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ తరువాత పిల్లలను తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన పోలీసులు కూడా నోరెళ్ల బెట్టారు. ఆ తరువాత కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కే బాలరాజు వెల్లడించారు. మైనర్లలకు నకిలీ కరెన్సీ ఎక్కడినుంచి వచ్చింది అని విచారణ చేస్తున్నారు. 
 

click me!