వివాహేతర సంబంధం : భర్తను ఊపిరాడకుండా చేసి, పాముతో కాటు వేయించి.. చంపించిన భార్య...

By SumaBala BukkaFirst Published Oct 14, 2023, 9:27 AM IST
Highlights

భర్త వివాహేతర సంబంధంతో విసిగిపోయిన ఓ భార్య అతడిని పాము కాటుతో హత్య చేయించింది. ఈ కేసులో భార్యతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు మిస్టరీగా మారింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో  ఈ కేసు వెలుగు చూసింది. ఆ కాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి,  బిల్డర్  కొచ్చెర ప్రవీణ్ (42) హత్యకు గురయ్యాడు. ఈ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హత్య కేసులో ప్రవీణ్ భార్యతో సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు, పెద్దపల్లిలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు.

కొచ్చర ప్రవీణ్, లలిత  దంపతులు. వీరికి 14,12,10 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా, కొద్దికాలంగా వేరే మహిళతో ప్రవీణ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్య లలితకు తెలిసింది. దీంతో నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతుండేవి.  తాను ఎన్నిసార్లు వారించినా.. భర్తలో మార్పు రాకపోవడంతో.. అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది లలిత. 

గ్రూప్ 2 అభ్యర్థిని బలవన్మరణం.. అశోక్ నగర్ లో ఉద్రిక్తత...

ప్రవీణ్ దగ్గర సెంట్రింగ్ పనులు చేసే రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మచ్చ సురేష్ (37)తో ఒప్పందం కుదుర్చుకుంది.  భర్తను చంపాలని, దానికి సహాయం చేయమని కోరింది. ప్రవీణ్ ను అంతమొందించడానికి సహకరిస్తే ఒక ఫ్లాట్ సురేష్ కు ఇస్తానని చెప్పింది. దీనికి సురేష్ ఒప్పుకున్నాడు. ప్రవీణ్ హతమార్చడానికి  మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్ (33), రామగుండానికి చెందిన ఇందారపు సతీష్ (25),  భీమ గణేష్ (23)లతో  హత్యకు  ప్లాన్ వేశాడు.

పోలీసులకు దొరకకుండా ఉండాలంటే సహజ మరణంగా ఉండాలని.. పాముతో కాటు వేయించి చంపాలని పథకం వేశారు.  దీనికోసం మందమర్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నన్నపరాజు చంద్రశేఖర్ (38) తో మాట్లాడారు. భర్తను చంపడం కోసం వారికి అయ్యే ఖర్చులకి సొమ్మును సమకూర్చడానికి లలిత తన దగ్గర ఉన్న 34 గ్రాముల బంగారు గొలుసును వారికి ఇచ్చింది. రామగుండంలో ఈనెల తొమ్మిదవ తేదీన నిందితులందరూ కలిసి మద్యం తాగారు.  

ఆ తర్వాత లలితకు ఫోన్ చేసి మాట్లాడి..  2 వీలర్ల మీద ఇంటికి చేరుకున్నారు. అప్పటికే నిద్రపోతున్న ప్రవీణ్ ను  వారికి చూపించింది లలిత.  ఆ తర్వాత తాను వేరే గదిలోకి వెళ్లిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిందితులు..  ప్రవీణ్ ముఖం మీద దిండుతో అదిమిపెట్టి హత్య చేశారు. ఊపిరాడకపోవటంతో ప్రవీణ్ కాసేపు పెనుగులాడాడు. ఆ తర్వాత అతనిలో కదలిక నిలిచిపోయింది.  

అది గమనించిన నిందితులు వెంటనే తమతో తెచ్చిన పాముతో ప్రవీణ్ కు కాటు వేయించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఆ పామును బహిరంగ ప్రదేశంలో వదిలేశారు. అయితే, భర్త గుండెపోటుతో మరణించాడని చెప్పడం.. ప్రవీణ్ తల్లి నమ్మలేదు. తన కొడుకు మృతిమై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తులో మరణంలో కుట్ర దాగి ఉందని తేల్చారు. భార్య లలితతో సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లుగా డిసిపి వెల్లడించారు. నిందితుల దగ్గర్నుంచి 6 సెల్ ఫోన్లు, 34 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. 

click me!