కడెం ప్రాజెక్టు మూడు పిల్లర్లకు పగుళ్లు: నిపుణుల కమిటీ కీలక నివేదిక

By narsimha lode  |  First Published Aug 1, 2023, 10:29 AM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుపై భద్రతా సమీక్ష కమిటీ రిపోర్టు పలు కీలక అంశాలను  పొందుపర్చింది.ప్రాజెక్టులో  నీటిని నిల్వ చేయవద్దని  కమిటీ సూచించింది.


ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుపై  భద్రతా సమీక్ష కమిటీ రిపోర్టు కీలక అంశాలను  ప్రస్తావించింది.  గత రెండేళ్లుగా  కడెం ప్రాజెక్టు గేట్లు మొరాయిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది.ఈ ఏడాది జూలై 27న కూడ  కడెం ప్రాజెక్టుకు  3.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.  ప్రాజెక్టు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నీటిని నిల్వ చేయవద్దని  కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

ఏబీ పాండ్యానేతృత్వంలోని డీఎస్ఆర్‌సీ కమిటీని  ప్రభుత్వం  ఏర్పాటు  చేసింది. ఈ ఏడాది జూలై  29న  ప్రాజెక్టును  నిపుణుల కమిటీ  క్షుణ్ణంగా పరిశీలించింది.  పాండ్యా నేతృత్వంలోని 24 నిపుణుల బృందం  ప్రాజెక్టును పరిశీలించింది.  ఈ మేరకు  నివేదికను సిద్దం  చేసింది.  ఈ నివేదిక ఆధారంగా  ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ నివేదికలో  ప్రభుత్వానికి కమిటీ పలు సూచనలు చేసింది.

Latest Videos

కడెం ప్రాజెక్టు పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టుగా  కమిటీ నివేదికను  ఇచ్చింది. ప్రాజెక్టు గేట్లను ఎత్తే క్రమంలో  వాటికి రక్షణగా  ఉండే పిల్లర్లలో పగుళ్లు ఉన్నట్టుగా కమిటీ గుర్తించింది. మూడు పిల్లర్లకు  పగుళ్లు ఏర్పడ్డాయని  నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ప్రాజెక్టు గేట్లకు చెందిన  కౌంటర్ వెయిట్ లు బలంగా తగలడం వల్లే పిల్లర్లకు పగుళ్లు ఏర్పడినట్టుగా నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో  నీరు నిల్వ చేయవద్దని భద్రతా కమిటీ ప్రభుత్వానికి సూచించింది. కడెం ప్రాజెక్టుకు చెందిన 18  గేట్లలో నాలుగు గేట్లు మొరాయిస్తున్నాయి. ప్రాజెక్టు స్పిల్ వే ను 5 లక్షల క్యూసెక్కుల సామర్ధ్యానికి పెంచాలని సూచించింది  కమిటీ.  అంతేకాదు  ఎగువ నుండి వచ్చిన వరదను  వచ్చినట్టే  కిందకు వదలాలని  నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.

కడెం ప్రాజెక్టుకు అదనపు  స్పిల్ వే నిర్మాణానికి  రూ. 600  కోట్లు ఖర్చు అవుతుంది.  అయితే స్పిల్ వే నిర్మాణం కోసం  కేంద్రం  70 శాతం, రాష్ట్రం  30 శాతం  నిధులను భరించాల్సి ఉంటుంది.  అయితే  ఈ ప్రాజెక్టుకు  ఎగువన  మరో ప్రాజెక్టు  నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నందున  అదనపు స్పిల్ వే  నిర్మాణం అవసరం లేదనే  అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే  ప్రచారం సాగుతుంది. 
 

click me!