సీఎంగా కేటీఆర్.. ప్రకటనలకోసం డబ్బు వసూళ్లు.. రంజీ క్రికెటర్ అరెస్ట్...

By AN TeluguFirst Published Feb 22, 2021, 11:00 AM IST
Highlights

మంత్రి కేటీఆర్ పీఏనని ప్రచారం చేసుకుంటూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడో ఘరానా మోసగాడు. ఇతనిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు (25) మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్.

మంత్రి కేటీఆర్ పీఏనని ప్రచారం చేసుకుంటూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడో ఘరానా మోసగాడు. ఇతనిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు (25) మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్.

కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడ్డ నాగరాజు తేలికగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నించాడు. ఎలా అయితే డబ్బులు సులభంగా వస్తాయా అని దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే తాను కేటీఆర్ పీఏనని పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు. 

అలా ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5.30 గం.లకు బంజారాహిల్స్ లోని రెయిన్ బో పిల్లల ఆస్పత్రి ల్యాండ్ లైన్ కు ఫోన్ చేశాడు. ఎండీ డాక్టర్ కంచర్ల రమేష్ ఫోన్‌ నంబర్‌ అడిగి తీసుకున్నాడు. తరువాత డాక్టర్ రమేష్ కు ఫోన్ చేసి తాను  కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిని మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చాడు. 

ఎల్బీ స్టేడియంలో ఈ నెల 25న కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పాడు. దీనికోసం మీడియా ప్రకటనల నిమిత్తం రూ. 50 లక్షలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నేపత్యంలో అనుమానం వచ్చిన డాక్టర్ రమేష్ ఆరా తీయగా ఆ నంబర్‌ తిరుపతిరెడ్డిది కాదని తేలింది. 

వెంటనే ఆస్పత్రి సీనియర్ మేనేజర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు గతంలో కూడా ప్రముఖులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్‌ చేసినట్లుగా తేలింది. జూబ్లీహిల్స్, ఓయూ, సైబర్‌ క్రైం పోలీసులు గతంలోనూ ఇతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

click me!