ఈటల కోసం రంగంలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. చెరుకు సుధాకర్‌తో భేటీ, రాజేందర్‌కు మద్ధతుకు అంగీకారం

By Siva KodatiFirst Published Jul 18, 2021, 5:08 PM IST
Highlights

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపే లక్ష్యంగా మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌‌ని కలిసిన ఆయన మద్ధతు కోరారు.
 

కేసీఆర్ కుటుంబం, ఈటల మధ్య కొట్లాట పార్టీల మధ్య కొట్లాట కాదన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు మద్ధతు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌‌ని ఆదివారం కలిసిన కొండా.. ఈటల రాజేందర్ కు రాబోయే ఉపఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలపాలని ఆయన కోరారు. విద్య, వైద్యం విషయంలో దేశంలోనే తెలంగాణ వెనుకబడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇరిగేషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి  వెళ్లిపోయిందని ఇది తెలంగాణ ముఖ్యమంత్రి చేతగానితనమని విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ సర్కార్ కరోనా కేసులను, మరణాలను కప్పిపుచ్చిందని ఆయన ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో 70 ఏళ్ల  వెనక్కు వెళ్లిపోయిందని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నానని దానికోసం అందరి మద్దతు కూడబెడుతున్నట్టు  కొండా చెప్పుకొచ్చారు. 

Also Read:2018లోనే నా ఓటమికి కుట్ర.. ఇప్పుడన్నది ఆనాటి కేసీఆర్ కాదు: ఈటల సంచలన వ్యాఖ్యలు

చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణాలో ఏం వేలం వేసినా కెసిఆర్ కుటుంబం తన సొంత లాభం చూసుకోకుండా టెండర్లు పిలవదని ఆయన ఆరోపించారు . మొన్న జరిగిన భూమి వేలంలో వేలకోట్ల కుంభకోణం జరిగిందని.. బండి సంజయ్ ఊరికే కెసిఆర్ అవినీతి బయటపెడతాం అనడం కాదని, కేంద్ర సంస్థలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఎంక్వరి వేయ్యాలంటూ సుధాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా దివాళా తీస్తే కాపాడవలసిన బాధ్యత కేంద్రానికి వుందన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనను కలవడానికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో హక్కుల గురించి ఉద్యమకారులుగా కోట్లలాడుతాం కానీ కేసీఆర్ చేస్తున్న దుబారాకు కళ్లెం వేయాల్సిన బాధ్యత బండి సంజయ్‌పై వుందని సుధాకర్ సూచించారు.

వైద్యం, ఆరోగ్య రంగంలో తెలంగాణ అట్టర్ ప్లాప్ అయ్యిందని.. గోదావరి నీళ్లు అలుగు పోస్తున్న  కృష్ణాలో ఎత్తిపోస్తే ఓ రెండు లక్షల కోట్లు దుబారా తప్ప ఎం వస్తుందని సుధాకర్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని.. రాక్షస పాలనను ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాల మధ్య సయోధ్య అవసరమని ఆయన హితవు పలికారు.  ఉద్యమ సమయంలో ఈటల టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం కార్డు లాంటి వాడని... అలాంటి ఒక 20 ఏళ్ల ఎమ్మెల్యేను దుర్మార్గంగా పార్టీలో నుండి పంపించారని సుధాకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కోసం ఈటల కోట్లాది రూపాయలు ఖర్చు చేసారనేది వాస్తవమని.. ఈటలను ఓడించే కుట్ర ఏదైనా తిప్పికొడుతామని చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు. 

click me!