ఈటెలతో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ భేటీ: రెండు గంటలు చర్చలు

By telugu teamFirst Published May 7, 2021, 6:10 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. రాములు నాయక్ ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్నారు.

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సమావేశమయ్యారు. ఈటెల రాజేందర్ తో ఆయన రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రాములు నాయక్ ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్నారు. గతంలో ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పనిచేశారు. 

ఈటెల రాజేందర్ ను ఇంతకు ముందు మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి కలిశారు. గతంలో ఆయన టీఆర్ఎస్ లో ఉన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరారు. కాంగ్రెసుకు కూడా ఆయన రాజీనామా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఈటెల రాజేందర్ కు ఆయన మద్దతు ప్రకటించినట్లు సమాచారం.

కాగా,  అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కున్న ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. అయితే, ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో లేరని సమాచారం.

టీఆర్ఎస్ నాయకత్వం తనను సస్పెండ్ చేసేదాకా వేచి చూడాలనే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడుతారా, వేరే పార్టీలో చేరుతారా అనేది తేలడం లేదు. అయితే, ఆయన కొత్త పార్టీ పెట్టే దిశగానే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గురువారంనాడు పలువురు మేధావులతో, ప్రముఖులతో చర్చలు జరిపారు. 

కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ ఏదో విధంగా టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నాయకులంతా ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ వెళ్లి వచ్చన తర్వాత ఈటెల రాజేందర్ షామీర్ పేటలోని తన నివాసంలనే ఉంటున్నారు. 

click me!