ఆర్టీసీని మాకు అప్పగిస్తే వేల కోట్లలో లాభాలు: కేసీఆర్ ప్రభుత్వానికి నాగేశ్వర్ సవాల్

By Nagaraju penumalaFirst Published Oct 17, 2019, 1:21 PM IST
Highlights

కేసీఆర్ కు చేతకకాకపోతే ప్రజా రవాణా వ్యవస్థను తమకు అప్పగిస్తే ఆర్టీసీనివేల కోట్ల లాభాల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీని పరిరరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిలదీశారు. 

హైదరాబాద్: ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ట్యాక్స్ వసూలు చేస్తున్న విషయాన్ని నాగేశ్వర్ గుర్తు చేశారు. 

ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు సామూహిక దీక్షలకు దిగాయి. సామూహిక దీక్షను నాగేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు నాగేశ్వర్. 

కార్మికుల జీతాలు పెరిగినందు వల్లే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని సీఎం కార్యాలయం నుంచి ప్రకటన రావడం పచ్చి అబద్ధమని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించినా ఇప్పటి వరకు చర్చలకు పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్ సగటు వేగం 15 కిలోమీటర్లు అని అందుకు కారణం ట్రాఫిక్, రోడ్లు సక్రమంగా లేకపోవడమేనని విమర్శించారు. 

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా కేసీఆర్ ప్రభుత్వం మెుండివైఖరితో ముందుకు వెళ్తుందని మండిపడ్డారు. ఇప్పటికీ తెలంగాణలో 1400 గ్రామాలకు బస్సులు లేవని గుర్తు చేశారు. ఆర్టీసీకి ఏటా రూ.700కోట్లు నష్టం వస్తుందని చెప్పుకొచ్చారు. లక్ష 60వేల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం కోటి మందికి సేవ చేసే ఆర్టీసీ నిష్టాలను భర్తీ చేయలేదా అని నిలదీశారు. 

ఎమ్మెల్యేల జీతాలపై ట్యాక్ వసూలు చేయరు గానీ నష్టాల్లో ఉన్నా ఆర్టీసీ నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసేది నష్టాల జాతీయకరణ లాభాల ప్రైవేటీకరణ అంటూ మండిపడ్డారు. 

ప్రభుత్వ విధానాల వల్ల రోజుకు ఆర్టీసీ రూ.80లక్షలు వడ్డీ కడుతుందని చెప్పుకొచ్చారు. తాను ప్రస్తావించిన అంశాలు వాస్తవమో కాదో ప్రభుత్వమే చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కు చేతకకాకపోతే ప్రజా రవాణా వ్యవస్థను తమకు అప్పగిస్తే ఆర్టీసీనివేల కోట్ల లాభాల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీని పరిరరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిలదీశారు. 

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని లేనిపక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీ సమ్మె: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు భేటీ

click me!