అంబేద్కర్ చౌరస్తాకు రమ్మన్న జూపల్లి.. నీ ఇంటికే వస్తానంటూ హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌లో నో ఛేంజ్

By Siva KodatiFirst Published Jun 21, 2022, 2:44 PM IST
Highlights

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్‌లో నేతల మధ్య విభేదాలకు చెక్ పడలేదు. ఇటీవల మంత్రి కేటీఆర్ వచ్చినా ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి మధ్య సవాళ్లు , ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. 
 

కొల్లాపూర్ నియోజకవర్గంలో (kollapur assembly constituency) అధికార టీఆర్ఎస్ పార్టీలో (trs) నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నియోజకవర్గంలో అభివృద్ధిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) , హర్షవర్థన్ రెడ్డి (harshvardhan reddy) మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 26న కొల్లాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని జూపల్లి సవాల్ చేయగా.. చర్చకు మీ ఇంటికే వస్తానంటూ ప్రతి సవాల్ చేశారు ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి. చర్చను పక్కదారి పట్టించడానికే తన ఇంటికి హర్షవర్థన్ వస్తున్నారని విమర్శించారు జూపల్లి. ఎమ్మెల్యే వచ్చినా రాకున్నా 26న అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. 

Also Read:మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి కేటీఆర్.. కొల్లాపూర్‌‌ టీఆర్ఎస్‌లో వర్గపోరు‌కు చెక్ పడినట్టేనా..?

కాగా.. కొద్ది రోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్‌ టీఆర్ఎస్‌లో జూపల్లి విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే జూపల్లి కొన్ని నెలల క్రితం ఖమ్మం జిల్లాలో పర్యటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసంతృప్తి నేతలుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన జూపల్లి.. తుమ్మలతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు. 

ఈ క్రమంలోనే జూపల్లి పార్టీ మారనున్నారనే ప్రచారం సాగుతూ వచ్చింది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా జూపల్లి హాజరు కాకపోవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే దానిపై స్పందించిన జూపల్లి.. తాను టీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం మంత్రి కేటీఆర్.. జుపల్లి ఇంటికి వెళ్లడం ద్వారా ఆయనకు ఏదో ఒక హామీ ఇచ్చి ఉంటారనే ప్రచారం సాగుతుంది. మరి కేటీఆర్..  జూపల్లి ఇంటికి వెళ్లిన నేపథ్యంలో కొల్లాపూర్ టీఆర్ఎస్‌లో వర్గపోరుకు పరిష్కారం దొరుకుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అలాంటిదేమి ఉండకపోవచ్చని.. పార్టీలో ఎలాంటి విబేధాలు లేవనే సంకేతాలు ఇవ్వడం కోసమే కేటీఆర్.. జూపల్లి ఇంటికి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. 
 

click me!