కోట్ల రూపాయల అక్రమాస్తులు: మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని గాంధీ అరెస్టు

By telugu teamFirst Published Apr 21, 2021, 7:05 AM IST
Highlights

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ జిఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సిబిఐ అరెస్టు చేసింది. తాము ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో ఆయనను అరెస్టు చేశారు.

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో వరుస నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో, విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను సిబిఐ అధికారులు మంగళవారం హైదరాబాదులో అరెస్టు చేశారు. 

శ్రీనివాస గాంధీపై సీబిఐ 2019 జూలైలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సిబిఐ నమోదు చేసింది. హైదరాబాదుకు చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.5 కోట్లు లంచం అడిగారనే ఫిర్యాదుతో 2020 సెప్టెంబర్ లో ఆయనపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనకు 2020 డిసెంబర్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ప్రమోషన్ లభించింది. 

అయితే, ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 21వ తేదీన ఆయనను సెంట్రల్ జీఎస్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబీఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో 1992లో ఇన్ స్పెక్టర్ గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటిండెంట్ గా ప్రమోషన్ పొందారు. 

2003లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ లోకి డిప్యుటేషన్ మీద వెళ్లి ఏడాది పాటు అందులో పనిచేశాడు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన బొల్లినేని గతంలో ఎప్పుడూ లేని విధంగా 2017 వరకు ఏ విధమైన బదిలీ లేకుండా పనిచేశారు. 

click me!