డీఎస్ మాత్రమే కాదు...బిజెపిలోకి మరికొందరు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు : దత్తాత్రేయ

By Arun Kumar PFirst Published Jul 13, 2019, 1:21 PM IST
Highlights

తెలంగాణ బిజెపిలో చేరికలపై మాజీ కేంద్ర మంత్రి, బిజెపి  సీనియర్ నాయకులు బండారు  దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం డీఎస్ ఒక్కరే  బిజెపిలో చేరడం లేదని ఆయనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు కాషాయం కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదిరించగలిగే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని మాజీ  కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తప్పకుండా భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే కాబోతున్నామని ఆయన తెలిపారు. అందుకోసం పక్క వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు మాజీ కేంద్ర మంత్రి వెల్లడించారు.

ముఖ్యంగా తెలంగాణ బిజెపి బలోపేతం కోసం అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారించారని దత్తాత్రేయ తెలిపారు. ముఖ్యంగా ఇతర పార్టీల్లో ప్రజాదరణ కలిగిన నాయకులను తాము పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ నుండి డి శ్రీనివాస్ చేరికకు సిద్దంగా వున్నారని...ఆయనతో పాటే మరికొంత మంది కాషాయం కండువా కప్పుకోడానికి సిద్దంగావున్నారంటూ దత్తాత్రేయ సంచలన ప్రకటన చేశారు.

Latest Videos

తెలంగాణ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో చేస్తోందని ఆయన అన్నారు. కానీ వాటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం తాము చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. అంతేకాకుండా తిరిగి బిజెపి పైనే దుష్ప్రచారం చేస్తోందని అన్నారు.       

పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలు కవిత, వినోద్ ల ఓటమితోనే కేసీఆర్ పతనం మొదలయ్యిందని అన్నారు.  రానున్న కాలంలో టీఆర్ఎస్ పార్టీ మరింత పతనం  అవనుందని...ఆ స్థానాన్ని బిజెపి అధిరోహించనుందని దత్తాత్రేయ వెల్లడించారు. 

రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి సర్వసాధారణంగా మారిందన్నారు.  కానీ ముఖ్యమంత్రికి మాత్రం కేవలం రెవెన్యూ శాఖ ఒక్కదాంట్లోని అవినీతే కనిపిస్తున్నట్లుంది అంటూ ఎద్దేవా చేశారు.   ఇకనైనా కేసీఆర్ మేలుకుని అవినీతి పాలనను తగ్గించి ప్రజాపాలన సాగిస్తే బావుంటుందని దత్తాత్రేయ సూచించారు. 
 
 

click me!