
వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుత.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. కానీ ఏ పార్టీలో చేరబోనని, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతామని పేర్కొన్నారు. ఎక్కడి నుంచి అనేది తాము ఇంకా నిర్ణయించుకోలేదని.. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తానని చెప్పారు.
అయితే విశాఖ కేంద్రంగానే జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఆయన.. కార్మికులకు మద్ధతు కూడా ప్రకటించారు. అలాగే స్టీల్ ప్లాంట్‌ను కొనేందుకు బిడ్ దాఖలు చేసి.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధన నిధుల సేకరణకు కూడా నడుం బిగించారు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో లక్ష్మీనారాయణ విశాఖ నుంచే అసెంబ్లీకి గానీ, లోక్‌సభకు కానీ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.
ఇకపోతే.. రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు. ఆపై విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడ పొగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే లక్ష్యంతో జేడీ పనిచేస్తున్నారు.