Huzurabad Bypoll Result: నిలబడ్డాడు.. కలబడ్డాడు.. ఈటల గెలుపు వెనుక..!

Published : Nov 02, 2021, 07:13 PM IST
Huzurabad Bypoll Result: నిలబడ్డాడు.. కలబడ్డాడు.. ఈటల గెలుపు వెనుక..!

సారాంశం

టీఆర్ఎస్‌కు సవాల్ విసిరి రణక్షేత్రంలో నిలబడి.. కలబడి తన సత్తా చాటాడు ఈటల రాజేందర్. తాను నమ్మిన జనమే బలంగా ముందుకు సాగారు. హరీశ్ రావు, ఇతర మంత్రులు, సీనియర్ నేతలు ఎన్ని వ్యూహాలు, సవాళ్లు విసిరినా.. వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నారు. బరిలో గెలిచి చూపించారు.

అధికార తెరాస వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ.. మంత్రి హరీశ్ రావు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ.. గులాబీ మంత్రుల విమర్శలకు ప్రతివిమర్శలతో సమాధానమిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ సింహాసనాన్ని ఎట్టకేలకు భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ దక్కించుకున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఏడోసారి విజయం సాధించారు. సిట్టింగ్ స్థానంలో మరోసారి గెలుపుబావుటా ఎగురవేసి తన సత్తా చాటారు. అధికార పార్టీ నుంచి వీడి.. కమలతీర్థం పుచ్చుకున్న ఈటల కాషాయం కండువాతో శాసనసభలో అడుగుపెట్టనున్నారు.

భాజపాలో చేరిక.. తెరాసకు సవాల్.. 
తెరాసలో ఏడేళ్లు మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ అధిష్టానానికి పొసగలేదు. పదవి తనకు ప్రజలు పెట్టిన భిక్షంటూ ఈటల బాహాటంగానే పలుసార్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలపైనా సునిశిత విమర్శలు చేశారు. ధనికులకు రైతు బంధు పథకం అమలు సహా గొర్రెలు, బర్రెలు పంపకాలపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఓ మంత్రిగా ఈటల అసంతృప్తి తెరాస పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఈటల భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ అధిష్ఠానం మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసింది. అసైన్డ్‌ భూములు ఆక్రమించారంటూ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ పరిణామాలన్నీ ముందే అంచనా వేసిన ఈటల రాజేందర్‌ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అధికారపక్షాన్ని ఢీ కొట్టాలని నిర్ణయించుకున్నారు. భాజపాలో చేరి తెరాసకు సవాల్‌ విసిరారు

Also Read: గెల్లుకు సొంతూర్లోనే కాదు.. అత్తగారి ఊరిలో‌నూ షాక్.. అక్కడ ఈటల ఆధిక్యం ఎంతంటే..?

జనమే బలం..
అప్పటి నుంచి ఇటు అధికార తెరాస, అటు ఇతర పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోకుండా.. ప్రజలే అండగా ముందుకు సాగారు. నియోజకవర్గంలో తనకంటూ జనబలాన్ని ఏర్పరుచుకుని.. ప్రజలే తన బలమని చెబుతూ చివరకు అదే నిజమని నిరూపించారు.

వామపక్ష భావజాలం గలిగిన ఈటల రాజేందర్‌ భాజపాలో చేరడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. భూ కబ్జా కేసుల నుంచి బయటపడేందుకే కాషాయ కండువా వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వాటన్నింటికి సమాధానమిచ్చిన రాజేందర్‌.. ప్రస్తుత రాజకీయ పరిణమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రణక్షేత్రంలోకి దిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల మనసులను చూరగొన్నారు. గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. స్థానిక నేతగా తాను చేసిన అభివృద్ధి
కార్యక్రమాలను వివరించారు. ఉద్యమ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ తనకు అన్యాయం జరిగిందని ఏకరువు పెట్టారు. ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. మంత్రి పదవి నుంచి అకారణంగా తొలగించి రాజకీయంగా దెబ్బతీయాలని తెరాస కుట్రచేసిందని ఎండగట్టడంలో ఈటల సఫలమయ్యారు. అది కలిసొచ్చింది.. స్థానికంగా బలమైన నాయకుడు కావడం.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సేవలు ఈటల విజయానికి కలిసివచ్చాయి. భాజపాలో చేరడం.. తెరాసకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం
తామే అనే సంకేతాలు రాజేందర్‌కు పట్టం కట్టడంలో దోహదం చేశాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!