అసెంబ్లీలో తమకు రూమ్‌ కూడా లేదన్న ఈటల రాజేందర్.. సభలో బడ్జెట్‌పైనే మాత్రమే మాట్లాడాలని మంత్రుల కౌంటర్..

By Sumanth KanukulaFirst Published Feb 8, 2023, 1:17 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు గది కేటాయించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బడ్జెట్‌పైనే మాట్లాడాలని, కేటాయించిన సమయాన్ని  సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు కౌంటర్ ఇచ్చారు. 
 

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు గది కేటాయించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమకు అసెంబ్లీలో కనీసం రూమ్‌ లేదని అన్నారు. ‘‘ఈ రోజు ఉదయం ఇంటి నుంచి టిఫిన్ పట్టుకుని వచ్చాం. ఎక్కడ కూర్చొని తినాలని అనుకుంటుంటే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారి రూమ్‌లో తినమని కూర్చొబెట్టారు. మీ(స్పీకర్‌) దృష్టికి మేము చాలా సార్లు ఈ విషయాన్ని తీసుకొచ్చాం’’ అని అన్నారు. 

ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న మంత్రి హరీష్ రావు.. శాసనసభ వ్యవహారాల గురించి మాట్లాడాలని అనుకుంటే స్పీకర్ చాంబర్‌కు వెళ్లి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఏ పక్షానికైనా ఐదుగురు సభ్యులుంటేనే శాసనసభలో రూమ్ ఇవ్వాలనే నిబంధన పెట్టుకున్నట్టుగా చెప్పారు. ఆ నిర్ణయానికి అనుగుణంగానే తమరు(స్పీకర్) నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఏదైనా కావాలంటే తమరికి రిక్వెస్ట్ చేసుకోవచ్చని చెప్పారు. 

ఆ తర్వాత ఈటల మాట్లాడుతూ.. గతంలో జయప్రకాస్ నారాయణ ఒక్కరికే గది కేటాయించారని చెప్పారు. గతంలో సీపీఐ, సీపీఎం నేతలకు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. రూమ్ విషయంలో ఆరు సార్లు తాము స్పీకర్‌ను కలిశామని చెప్పారు. ముగ్గురు శాసనసభ్యులకు ఒక రూమ్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. తాము ఏమైనా మాట్లాడాలని అనకుంటే ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవాలని అడిగారు. 

ఈ క్రమంలోనే మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..  బడ్జెట్‌పై ప్రసంగంపై మాట్లాడాలని.. సౌకర్యాల విషయంలో ఏమైనా సమస్య ఉంటే స్పీకర్‌కు నివేదించవచ్చని చెప్పారు. బడ్జెట్‌పై పరిమితమై మాట్లాడాలని కోరారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్న తమకు ఏ విధైన అభ్యంతరం లేదన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కలగజేసుకుని.. ఏదైనా సమస్య ఉంటే.. తన చాంబర్‌కు వచ్చి కలవాలని ఈటల రాజేందర్‌‌కు సూచించారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. శాసనసభ రూల్స్ సభాపతి చేతిలో ఉంటాయని అన్నారు. బడ్జెట్‌పై మాట్లాడేందుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. బడ్జెట్‌పై కాకుండా వేరే అంశాలపై మాట్లాడుతూ.. వారి నోరు నొక్కుతున్నారని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభ్యుల సంఖ్య ప్రకారం మాట్లాడే సమయం వస్తుందని అన్నారు. 

అనంతరం ఈటల రాజేందర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వాన్ని కావాలని విమర్శించడం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసిందని అన్నారు. జీఎస్‌డీపీలో 25 శాతానికి మించి అప్పులు చేయకూడదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్‌డీపీలో 38 శాతం అప్పులు చేసిందని  విమర్శించారు. బీసీల కోసం బడ్జెట్‌లో పెట్టిన నిధులను విడుదల చేయడం లేదని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను ప్రతినెలా చెల్లించాలని  కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. 

ఇక, దళిత బంధుకు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని.. ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే దళిత బంధుకు సంబంధించి పలు విషయాలు మాట్లాడారు. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దళిత బంధును ఐఏఎస్ అధికారులకు ఇస్తామని  సీఎం కేసీఆర్ ఎక్కడ చెప్పలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ పథకాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పారని తెలిపారు. దళిత బంధుకు సంబంధించి విమర్శలు చేసే సభ్యులు.. కేంద్ర ప్రభుత్వం నుంచి దళిత బంధు పథకానికి నిధులు ఇప్పియాలని కోరారు. అనంతరం ప్రసంగాన్ని కొనసాగించిన ఈటల రాజేందర్.. దళిత బంధును ఎన్ని సంవత్సరాలలో అమలు చేస్తారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

click me!