ఆకలినైనా భరిస్తాం... ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోం, చిల్లరదాడులకు భయపడేది లేదు: ఈటల

By Siva Kodati  |  First Published Jul 17, 2021, 10:00 PM IST

తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు గానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ఎదురుదాడులకు, చిల్లరదాడులకు భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు. 


అధికారంలో ఉన్నా, లేకున్నా హుజురాబాద్ ప్రజల కోసం ఎంతో పనిచేశానని తెలిపారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. వీణవంక మండలం చల్లూర్ గ్రామంలోని వెంకటేశ్వర గార్డెన్ లో  జరిగిన బీజేపీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉద్యమకాలంలోనూ శక్తివంచన లేకుండా పనిచేశానని గుర్తుచేశారు. చట్టాలను తమ చుట్టాలుగా వాడుకునే నీచ సంస్కృతి నడుస్తోందని.. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరని, అసహ్యహించుకుంటున్నారని ఈటల తెలిపారు.

ప్రజల్లో బలమున్నవారు చేసే పనులు ఇవి కావని.. బలహీనులు కాబట్టే ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారంటూ రాజేందర్ దుయ్యబట్టారు. ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఈటల జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఒక్కటే కాదు.. రాష్ట్రమంతటా ఇలాంటి పరిస్థితి ఉందని, కార్యకర్తలు ఓపిక, సహనంతో పనిచేయాలని రాజేందర్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కారు సామాజిక న్యాయాన్ని పాటిస్తోందని, అందుకే 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో స్థానమిచ్చారని ఈటల గుర్తుచేశారు. సహజ న్యాయసూత్రాలను పాటించే పార్టీ బీజేపీ మాత్రమేనని రాజేందర్ ప్రశంసించారు.

Latest Videos

undefined

Also Read:పాదయాత్రకు సిద్దమైన ఈటల రాజేందర్... రూట్ మ్యాప్ ఖరారు

రాష్ట్రంలో ఎస్సీల జనాభా 16-17 శాతం ఉందని... కానీ కేబినెట్‌లో మాల, మాదిగలలో ఒక్కరికే మాత్రమే అవకాశం ఇచ్చారంటూ ఈటల మండిపడ్డారు. 0.5 శాతంగా ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారంటూ ఆయన చురకలు వేశారు. ఎదురుదాడులకు, చిల్లరదాడులకు భయపడేది లేదని.. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు గానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

click me!