కేసీఆర్ మీద గజ్వేల్ నుంచి తాను పోటీకి దిగడం ఖాయం అంటూ ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ మీద పోటీకి దిగుతానని ఆషామాషీగా చెప్పలేదని చెప్పుకొచ్చారు.
జమ్మికుంట : టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన అసమ్మతినేత ఈటెల రాజేందర్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విలుచుకుపడ్డారు. తాను కేసీఆర్ మీద గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చెప్పిన మాట వాస్తవమేనని.. ఆషామాషీగా చెప్పలేదని.. కచ్చితంగా తాను ఆ మాట నిలబెట్టుకుంటానని అన్నారు. బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జమ్మికుంటలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఈ సందర్భంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ఈటెల రాజేందర్ ను సవాల్ చేస్తూ.. ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అన్నారు. దీని మీద ఈటల రాజేందర్ స్పందించారు. టిఆర్ఎస్ నాయకులు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించడం కోసం దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు.
undefined
మహిళలకు తులం బంగారం.. విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ : కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరిన్ని హామీలు
తాను అక్కడ మళ్లీ గెలవకుండా ఉండాలని అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించారు. ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేశారు. అయినా తాను గెలిచానని, ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం సీఎం కేసీఆర్ ను ఓడించడమేనని చెప్పుకొచ్చారు. తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే గజ్వేల్ నుంచి పోటీకి దిగుతున్నట్లుగా ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈసారి ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ రాకపోవడంతో మధు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించినట్లుగా తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి మధు స్వగ్రామం. సోమవారం ఉదయం అక్కడే మధు తన రాజీనామా ప్రకటనను చేశారు. తాను కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నట్లుగా ప్రకటించారు. త్వరలో, తన స్వగ్రామమైన కొత్తపల్లి నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లుగా తెలిపారు. చివరి క్షణం వరకు నీలం మధు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు భంగపాటు ఎదురయింది.
ఆదివారం నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఫాం వచ్చింది. దీంతో నీలం మధు ముదిరాజ్ తీవ్ర మనస్థాపానికి గురై నిర్ణయం తీసుకున్నారు. 2001లో బీఆర్ఎస్ లో చేరారు నీలం మధు. 2014లో జరిగిన జడ్పిటీసీ, ఎంపిటీసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. ఆ తరువాత, 2019లో చిట్కూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచ్ అయ్యారు.
రాజీనామా ప్రకటన చేసిన తర్వాత మధు మీడియాతో మాట్లాడారు. పటాన్చెరువులో ఆత్మగౌరవం కావాలో, అహంకారం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ‘ఇక్కడ సెట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మీ బిడ్డనై వస్తున్న ఈ బీసీ బిడ్డను ఆశీర్వదించండి. దోచుకుని, దాచుకోవడం మహిపాల్ రెడ్డి తత్వం.
పటాన్చెరువు నియోజకవర్గం ఏ ఒక్క కులానికో చెందింది కాదు. ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. మహిపాల్ రెడ్డి అక్రమాల చిట్టా మొత్తం నా దగ్గరుంది. నన్ను, నా కార్యకర్తలను తొక్కేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర మొత్తం పటాన్చెరువు వైపే చూస్తోంది. ఇక నిర్ణయం ప్రజలదే’ అంటూ మధు చెప్పుకొచ్చారు.