ముందు నేను వాళ్ల కాళ్లు మొక్కా.. ఆ తర్వాతే నా కాళ్లు కడిగించుకున్నా: పాలాభిషేకం వివాదంపై ఈటల స్పందన

By Siva KodatiFirst Published Jul 29, 2021, 6:41 PM IST
Highlights

తనకు దళితులు కాళ్ళు కడుగుతామని వచ్చారని.. ఎక్కడ విమర్శిస్తారోని, ముందు వాళ్ల కాళ్ళు మొక్కి ఆ తర్వాత నా కాళ్లు కడిగించుకున్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజురాబాద్‌లో ప్రస్తుత పరిస్ధితిపై ఆయన స్పందించారు. 

హుజురాబాద్‌లో వాట్సాప్ చాట్ వ్యవహారం, దళితుల ఆందోళనలపై స్పందించారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. ఆయన నిర్వహిస్తున్న  ప్రజా దీవెన పాదయాత్ర గురువారం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. తనను ఒడగొట్టే దమ్ము లేక, కొన్ని టీవి ఛానెళ్లు అడ్డు పెట్టుకొని కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నేను మాదిగల మీటింగ్‌లకు పోతే, తనను రాజేందర్ మాదిగ అని పిలిచేవారని ఆయన వెల్లడించారు.

తనకు దళితులు కాళ్ళు కడుగుతామని వచ్చారని.. ఎక్కడ విమర్శిస్తారోని, ముందు వాళ్ల కాళ్ళు మొక్కి ఆ తర్వాత నా కాళ్లు కడిగించుకున్నానని రాజేందర్ పేర్కొన్నారు. వేల మంది దళిత బిడ్డలకు విజ్ఞానం నేర్పించిన అర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను నిర్ధక్షిణ్యంగా బయటకు పంపించారని ఈటల ఆరోపించారు. దళిత బిడ్డలను ఏసీ బస్సుల్లో ఎస్కార్ట్ పెట్టి ప్రగతి భవన్‌కు తీసుకెళ్లారని.. నా రాజీనామా తర్వాతనే కేసీఆర్ దళితులకు గౌరవం ఇస్తున్నారని రాజేందర్ స్పష్టం చేశారు.

ALso Read:హుజురాబాద్: వాట్సాప్‌ చాట్ వ్యవహారంలో ట్విస్ట్.. ఈటల పాదాలకు దళితుల పాలాభిషేకం, వీడియో వైరల్

నా బావమరిది దళితులను ఏమన్నాడో అని టీ న్యూస్‌లో అదే పనిగా ప్రసారం  చేస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. తలకాయ కిందకు, కాళ్ళు మీదకు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కేసీఆర్‌ను బొంద పెట్టడం ఖాయమని రాజేందర్ జోస్యం చెప్పారు. రాజకీయ వ్యవస్థను కేసీఆర్ బోన్‌లో నిలబెట్టాడని.. ఇంత కన్నా మెరుగైన పాలనను బీజేపీ అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 20 ఏళ్లుగా బిజేపీయే పాలిస్తోందని  రాజేందర్ గుర్తుచేశారు. 2023లో రాష్ట్రంలో బిజేపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రారంభం అయిన మరుక్షణమే, పోయిన వాళ్ళు అందరు మళ్లీ నా దగ్గరకు వస్తారని.. వారికి తనతో వున్న అనుబంధం అలాంటిదన్నారు. తన వెంట వున్న పింగిలి రమేష్‌కు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. 

click me!