రహస్యంగా భేటీ అయిన ఈటెల, రేవంత్ రెడ్డి? ఫొటోలు చూపించమంటారా? : మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలనం...

By SumaBala BukkaFirst Published Jul 3, 2023, 2:14 PM IST
Highlights

ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని.. దానికి సంబంధించిన ఫొటోలు తన దగ్గర ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 

హైదరాబాద్ : ఆదివారం ఖమ్మంలో జరిగిన  కాంగ్రెస్  జనగర్జన సభలో రాహుల్ గాంధీ బిఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే బిజెపి రిస్తేదార్ సమితి  అన్నారు. కెసిఆర్, బిజెపి ఒకటేనని చెబుతూ.. బిజెపికి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. దీనిమీద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు.

రాహుల్ గాంధీని చాలామంది పిలుస్తున్నట్లుగానే ఆయన పప్పు అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ బిజెపిలే ఏ టీం, బీ టీం అంటూ ఎద్దేవా చేశారు.  ఈ నేపథ్యంలోనే  బిజెపి నేత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ల రహస్యం మంతనాల గురించి సంచలన విషయాలు తెలిపారు.  వారిద్దరూ రహస్యంగా కలిసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.  అంతేకాదు ఈ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలు చూపించాలా? అని  అడిగారు.

Latest Videos

రాసింది చదవడమే రాహుల్ చేస్తున్న పని.. : ఖమ్మం సభలో కామెంట్స్‌పై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్

ఇప్పటికే బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లో చేరతారు అన్న ఊహాగానాలు వెలుబడుతున్న నేపథ్యంలో..ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మామూలుగా బిజెపి లాంటి జాతీయ పార్టీల్లో మొదటి నుంచి ఉన్న నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వెళ్లిన ఈటెలకు తగిన ప్రాధాన్యత దక్కలేదనే చెప్పాలి.

దీంతోనే గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్టీలో చేరడంతో మరోసారి ఈటెల రాజేందర్ ప్రస్తావన తెరమీదకి వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ టచ్ లోనే ఉన్నారని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత రెడ్డి వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోసినట్టు అయింది.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల మీద ఎలాంటి అవగాహన లేకుండానే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్క్రిప్టు రాసిస్తే రాహుల్ గాంధీ చదివి వెళ్లిపోతున్నాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ రిమోట్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో గుర్తు పెట్టుకొని మాట్లాడాలన్నారు. 

అసలు రాహుల్ గాంధీ హోదా కాంగ్రెస్ పార్టీలో ఏంటో ఎవరికి తెలియదన్నారు. తెలంగాణ రాకముందు 10 సంవత్సరాల పాటు  కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి ఉందని.. అప్పుడు పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇక్కడ అమలవుతున్న పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 

click me!