ఈటెలపై భూకబ్జా ఆరోపణలు: అచ్చంపేటలో విచారణ ప్రారంభం

By telugu teamFirst Published May 1, 2021, 9:38 AM IST
Highlights

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ మీద వచ్చిన భూకబ్జా ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మెదక్ జిల్లా అచ్చంపేటలో విచారణ ప్రారంభించారు.

హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీద వచ్చిన భూకబ్జా ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది. విచారణ నిమిత్తం రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మెదక్ జిల్లాలోని అచ్చంపేట చేరుకున్నారు. అచ్చంపేటలోనే కాకుండా హకీంపేటలో కూడా ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 

విచారణ నేపథ్యంలో అచ్చంపేటలో భారీగా పోలీసులను మోహరించారు. రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. బాధిత రైతులను అధికారులు పిలిపించారు. ఎంత భూమి కబ్జాకు గురైందనేది గుర్తిస్తామని, ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందనేది, రికార్డుల్లో ఆ భూమి ఎవరి పేరు మీద ఉందనేది గుర్తిస్తామని అధికారులు అంటున్నారు. రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

అధికారులు భూమి సర్వే చేయడంతో పాటు ధ్రువ పత్రాలను కూడా పరిశీలిస్తారు. హకీంపేటకు చెందిన రైతులను కూడా అచ్చంపేటకు పిలిపించి విచారిస్తున్నారు. జమున హాచరీస్ కోసం ఈటెల రాజేందర్ వందకు పైగా అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. 

శుక్రవారం రాత్రి కేసీఆర్ ఆదేశాలు వెలువడిన తెల్లారే శనివారం ఉదయం రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. తాను ఏ విచారణకైనా సిద్ధమని ఈటెల రాజేందర్ చెప్పారు. ఈటెల రాజేందర్ అంటే నిప్పు అని ఆయన అన్నారు.  

click me!