
బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారంలో నవీన్‌ను అతడి స్నేహితుడు హరిహరకృష్ణ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. నిందితుడు పేరాల హరిహరకృష్ణపై ఐపీసీ సెక్షన్ 302, 201, 5(2)(వీ)లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణ పోలీసుల ముందు లొంగిపోయాడు. అలాగే పోలీసుల ముందు నేరాన్ని కూడా అంగీకరించాడు.
తాను, నవీన్ ఇంటర్మీడియట్ దిల్‌సుఖ్‌నగర్‌లో కలిసి చదువుకున్నామని నిందితుడు హరిహరకృష్ణ పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో తాను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు. నవీన్ కారణంగా తాను ప్రేమించిన అమ్మాయి దూరమైందని పేర్కొన్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి నవీన్‌తో సన్నిహితంగా ఉండేదని తెలిపాడు. ఈ క్రమంలోనే నవీన్ హత్య కోసం 3 నెలలుగా ప్లాన్ చేసి సమయం కోసం ఎదురుచూశానని చెప్పాడు. ఫిబ్రవరి 17న నవీన్‌తో కలిసి ఎల్‌బీనగర్‌లో తిరిగానని.. అదే రోజు పెద్ద అంబర్‌పేటకు చేరుకోగానే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. ఈ క్రమంలోనే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నవీన్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసినట్టుగా నేరాన్ని అంగీకరించాడు. నవీన్ గుండె, తల, చేతివేళ్లు కత్తితో వేరుచేసి అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పాడు.
ఈ కేసుకు సంబంధించి రాచకొండ సీపీ మాట్లాడుతూ.. హరిహరకృష్ణను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రేమించిన అమ్మాయి కోసమే హత్య చేసినట్టుగా తేలిందన్నారు. నవీన్ హత్యకు హరిహర కృష్ణ ముందుగానే ప్లాన్ చేశాడని తెలిపారు. కుట్రపూరితంగానే నవీన్‌ను హత్య చేశాడని ఘటన స్థలంలో భయానక పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. నవీన్ హత్యలో అమ్మాయి పాత్ర ఏమైనా ఉందా? అని విచారణ జరుపుతున్నామని తెలిపారు.
అసలేం జరిగిందంటే.. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన నవీన్ బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు. నవీన్, ముసారంబాగ్‌కు చెందిన హరిహరకృష్ణ ఇంటర్‌లో క్లాస్‌మేట్స్. వీరిద్దరు ఒకే యువతిని ప్రేమించారు. యువతి కారణంగాఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన ఉదయం పార్టీ చేసుకుందామని హరిహరకృష్ణ.. తన స్నేహితుడి రూమ్‌కు నవీన్ ను రావాలని ఆహ్వానించాడు. దీంతో నవీన్ అక్కడికి చేరుకోగా.. మరోసారి యువతి విషయంలో గొడవ జరిగింది.
అయితే ఆ రోజు నుంచి నాలుగు రోజులైనా కూడా నవీన్ కాలేజీకి కానీ, ఇంటికి కానీ రాలేదు. దీంతో కంగారుపడ్డ అతను తండ్రి శంకరయ్య నార్కట్‌పల్లి(నవీన్ కాలేజ్ ఉన్న ప్రాంతం) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా హరి స్నేహితులను, ఎంజీయూలోని విద్యార్థులను ప్రశ్నించారు. ఈ విచారణలో ఈనెల 22 సాయంత్రం నుంచి హరిహరకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని తేలింది. దీంతో హరి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి అడిగారు. అప్పటివరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న హరిహరకృష్ణ స్నేహితులు, కుటుంబసభ్యులు, పోలీసుల నుంచి తన మీద ఒత్తిడి పెరుగుతుందని గ్రహించి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.