ఈసీ కీలక నిర్ణయం: ఓటరుకు సహయంగా వచ్చే వారికి సిరా గుర్తు


ఓటు నమోదు చేసుకొనే సమయంలో  ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో  కేంద్ర ఎన్నికల సంఘం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.  తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. 



హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలకనిర్ణయం తీసుకుంది.  ఓటు వేసేందుకు వచ్చే వారి సహాయకుల కుడి చేతి వేలుకు ఇంకు గుర్తును పెట్టాలని  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.దివ్యాంగులు లేదా  వయోవృద్దులను పోలింగ్ బూత్ వద్దకు  తీసుకొచ్చి ఓటు చేయించే సహయకుల కుడి చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.ఏ పోలింగ్ బూత్ పరిధిలోని వ్యక్తే  ఆ పోలింగ్ బూత్ పరిధిలోని ఓటరుకు సహాయకుడిగా రావాలని  కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  

సాధారణంగా  ఓటు చేసిన వారి ఎడమ చేతి చూపుడు వేలుకు ఇంకు గుర్తును పెడతారు.  ఓటు వేసే వారికి సహాయకులుగా వచ్చిన వారికి మాత్రం కుడి చేతి చూపుడు వేలుకు సిరా గుర్తును పెడతారు.మరో వైపు ఉదయం ఐదున్నర గంటలకే మాక్ పోలింగ్ ను ప్రారంభించాలని ఈసీ సూచించింది. అయితే పోలింగ్ బూత్ లలో పోలింగ్ ఏజంట్లుగా  సర్పంచ్ లు, వార్డు సభ్యులు కూడా కూర్చునేందుకు అవకాశం కల్పించింది  ఈసీ.

Latest Videos

తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.ఈ నెల  3న నోటిఫికేషన్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. గత నెల  9వ తేదీన  ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణతో పాటు మరో నాలుగు అసెంబ్లీలకు  ఎన్నికలు జరుగుతున్నాయి.  మిగిలిన రాష్ట్రాలతో పాటు పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే  అత్యధికంగా నగదు పట్టుబడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుండి  నిన్నటి వరకు  సుమారు. 500 కోట్లకు పైగా  పోలీసులు సీజ్ చేశారు. సరైన ధృవపత్రాలు లేని కారణంగా ఈ నగదును సీజ్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత పదేళ్లు అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది.కర్ణాటకలో అధికారం దక్కడంతో  అదే ఫార్మూలాను అనుసరించాలని కాంగ్రెస్  భావిస్తుంది. దక్షిణాదిలో  పట్టు సాధించాలని బీజేపీ  వ్యూహరచన చేస్తుంది. దక్షిణాదిలో  కర్ణాటకలో  అధికారం కోల్పోవడంతో   తెలంగాణపై  బీజేపీ ఫోకస్ పెట్టింది.  ఈ ఎన్నికల్లో  అధికారాన్ని దక్కించుకోనేందుకు  బీజేపీ అన్ని అస్త్రాలను  సిద్దం చేసుకుంటుంది. 

click me!