
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు ముగిశాయి. మేనేజ్‌మెంట్ కోటా కింద పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు తెలంగాణలోని 9 మెడికల్ కాలేజ్‌లకు చెందిన 16 ప్రాంతాల్లో బుధవారం నుంచి సోదాలు ప్రారంభించారు. ఈ జాబితాలో మెడిసిటీ మెడికల్ కాలేజ్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్, పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డెక్కన్ మెడికల్ కాలేజ్, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్లా రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చల్మెడ ఆనంద్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి.
అయితే బుధవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు ఈ కాలేజ్‌లకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు, వారి సన్నిహితుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేశారు. సోదాల సందర్భంగా ఈడీ అధికారులకు సీఆర్‌పీఎఫ్ సిబ్బంద భద్రతా కల్పించారు.
పోస్టుగ్రాడ్యుయేషన్ మెడికల్ సీట్ల భర్తీలో అవకతవకలు జరుగుతున్నాయని, వివిధ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్లను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని అనుమానిస్తూ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) గతేడాది వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు మేనేజ్‌మెంట్ కోటా కింద పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి అక్రమంగా హవాలా మార్గంలో భారీ మొత్తంలో మార్పిడి, అక్రమాలకు పాల్పడినట్లు ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 9 ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై దాడులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.కాలేజ్‌ల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించిన వివరాలను పరిశీలించారు. అయితే దాదాపు 24 గంటల పాటు సాగిన ఈడీ సోదాలు తాజాగా ముగిశాయి.