
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవి శాశ్వతం కాదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఫోన్ చేసి తప్పుకోమంటే.. తన బిస్తరు ఎప్పుడు రెడీగా ఉంటుందని చెప్పారు. తాను పార్టీ కార్యకర్తను అని అన్నారు. తాను ఉన్నా లేకున్నా బీజేపీకి నష్టం ఉండదని వ్యాఖ్యానించారు. బీజేపీ అనేది వ్యక్తి ఆధారితంగా పనిచేసే పార్టీ కాదని అన్నారు. మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన బహిరంగ సభకు బండి సంజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనపై రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు జరుగుతున్నాయని చెప్పారు. పోలింగ్ బూత్‌ల పరిధిలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరులను స్మరించుకునే స్థితిలో లేరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. ఆ పార్టీలో ఎవరూ చేరొద్దని అన్నారు. తెలంగాణలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బండి సంజయ్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు కలిసి ర్యాలీలు నిర్వహిస్తారని.. రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయబడిన గిరిజన మహిళను ఓడించడానికి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పని చేశారని అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదు. కేసీఆర్‌ను ఓడించడమే తమ ధ్యేయమని చెప్పుకుంటున్న నేతలు ఎందుకు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు
బీఆర్ఎష్ ఎమ్మెల్యేలు మహిళను వేధిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోస పేదలు త్యాగాలు చేశారు.. కానీ ఇప్పుడు ధనవంతులు అనుభవిస్తున్నారని విమర్శించారు.. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, 2 బీహెచ్‌కే ఇళ్లు, పోడు భూమి పట్టాలు వంటి హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం కరీంనగర్‌లో బండి సంజయ్ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నాణ్యత లేని ఇళ్లను కట్టి ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ 15 వేల ఇళ్లా? ఇచ్చేది ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం రెండు లక్షలకు పైగా ఇళ్లు ఇచ్చిందని చెప్పారు.