తీన్మార్‌ మల్లన్న కొత్త పార్టీ.. అభ్యంతరాలుంటే తెలుపాలని ఈసీఐ నోటిఫికేషన్..

By Sumanth KanukulaFirst Published Sep 8, 2023, 9:29 AM IST
Highlights

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమవుతుంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నాయకత్వంలో కొత్త పార్టీ రాబోతుంది.

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమవుతుంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నాయకత్వంలో కొత్త పార్టీ రాబోతుంది. ఈ మేరకు తీర్మాన్ మల్లన్న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. తన పార్టీ పేరును ‘‘తెలంగాణ నిర్మాణ పార్టీ’’గా పేర్కొన్నారు. అయితే తీన్మార్ మల్లన్న చేసుకున్న దరఖాస్తుపై ఈసీ కూడా స్పందించింది. తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) నేతృత్వంలోని తెలంగాణ నిర్మాణ పార్టీని  కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫై చేసింది. ఈ పార్టీ పేరు, ఇతర అంశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే తెలుపాల్సిందిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 20వ తేదీలోపు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపింది. 

తెలంగాణ నిర్మాణ పార్టీ అధ్యక్షుడుగా తీన్మార్ మల్లన్న (మాదాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా), పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాదం రజినీ కుమార్‌ (వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌), కోశాధికారిగా ఆర్‌ భావన (చంపాపేట్‌, సరూర్‌నగర్‌, హైదరాబాద్‌) ఉన్నారని పేర్కొంది. ఇదిలా ఉంటే, తెలంగాణ నిర్మాణ పార్టీ గత నెల 25నే పబ్లిస్ నోటీసు కూడా జారీ చేసింది.

ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని తీన్మార్‌ మల్లన్న పలు సందర్బాల్లో ప్రకటించిన సంగతి  తెలిసిందే. గతంలో బీజేపీలో కొనసాగిన మల్లన్న.. తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టుగా కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!