తెలంగాణ మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టే ప్రయత్నం చేసింది హరీష్ రావేనని ఈటల ఆరోపించారు.
కరీంనగర్: తెలంగాణ మంత్రి, ఒకప్పటి తన సహచరుడు తన్నీరు హరీష్ రావుపై మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావే ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. 2018లో తన అనుకూల ఎమ్మెల్యేలకు హరీష్ రావు డబ్బులు ఇవ్వడం వల్లనే కేసీఆర్ ఆయనను దూరం పెట్టారని ఈటల అన్నారు.
హరీష్ రావు సీఎం కేసీఆర్ వద్ద ఓ రబ్బరు స్టాంపు అని, ఆయనకు స్వేచ్ఛ లేదని, పైగా హరీష్ రావుకు నిజాయితీ కూడా లేదని ఈటల రాజేందర్ అన్నారు. అదే ఎన్నికల సమయంలో నువ్వు, మీ మామ చెప్పిన వివరాలుపై విచారణకు సిద్ధమా ఆయన సవాల్ చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతోనే తాను పార్టీకి ద్రోహం చేశానని హరీష్ రావు అంటున్నారని, సీఎం సీటుకు ఎసరు పెట్టే ప్రయత్నం చేసిందే హరీష్ రావు అని ఆయన అన్నారు.
undefined
తనకు హరీష్ రావు లాగా డ్రామాలు ఆడడం, అబద్ధాలు చెప్పడం రాదని, కుంకుమ భరిణలు ఇస్తున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను ఎక్కడ పంచానో చూపించాలని ఆయన అన్నారు. తమ ఇద్దరిలో ఎవరిది తప్పయితే వాళ్లం ముక్కుకు నేలకు రాద్దామని ఆయన అన్నారు.
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సొంత పార్టీ నాయకులను వెల కట్టి కొంటున్నారని, కోట్ల రూపాయలు పట్టుకొచ్చి ఇక్కడ కొనుగోళ్లు చేస్తున్నారని, హరీష్ రావు పతనం హుజూరాబాదు నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
హరీష్ రావు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని, గతాన్ని మరిచిపోయి మామ కేసీఆర్ మాయలో పడ్డారని, ఇన్నాళ్లు తెలంగాణ ప్రజలకున్న అభిమానాన్ని కూడా హరీష్ రావు కోల్పోయారని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ కు ఓనర్లమని తాను అంటే హరీష్ రావుకు పదవి వచ్చిందని ఆయన అన్నారు. త్వరలోనే హరీష్ రావు బండారం బయటపెడుతానని ఆయన అన్నారు. తన నియోజకవర్గానికి తనను అభాసుపాలు చేయాలని చేసే ఎవరిని కూడా తాను వదిలిపెట్టబోనని ఈటల రాజేందర్ హెచ్చరించారు.