తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపిలో చేరిన ఈటల, ఏనుగు, తుల ఉమ

By telugu teamFirst Published Jun 14, 2021, 12:20 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, అశ్వత్థామ రెడ్డి, తుల ఉమ తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. తరుణ్ చుగ్ సమక్షంలో వారు బిజెపిలో చేరారు.

న్యూఢిల్లీ:  మాజీ మంత్రి ఈటల రాజేందర్శి బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయం కండువ కప్పుకున్నారు. ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రె్డి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, ఓయు జేఏసీ నాయకులు బిజెపిలో చేరారు. 

ధర్మేంద్ర ప్రధాన్ ఈటల రాజేందర్ కు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. జెపి నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తాను తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో బిజెపిని అన్ని గ్రామాలకు విస్తరించడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు దక్షిణ భారతదేశంలో పార్టీని విస్తరించేందుకు బిజెపి నేతలు చేస్తున్న ప్రయత్నాలకు సహాయం చేస్తానని చెప్పారు. బిజెపిలోకి స్వాగతం పలికినవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. బిజెపిలోకి మరింత మంది నాయకులు వస్తారని ఆయన చెప్పారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. వారంతా తిరిగి మంగళవారం ఈ నెల 15వ తేదీ హైదరాబాదు తిరిగి రానున్నారు. 

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు మాత్రమే కాకుండా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను వెంటనే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడమే కాకుండా హుజురాబాద్ శాసనసభా నియోజకవర్గం ఖాళీ అయినట్లు ఎన్నికల కమిషనర్ కు తెలియజేశారు. దీంతో వచ్చే ఆరు నెలల్లోగా హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరగాల్సి ఉంటుంది.

హుజూరాబాద్ కు సాధ్యమైనంత త్వరగా ఎన్నిక జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో బిజెపి రాష్ట్ర నాయకత్వం ఉంది. సమయం ఎక్కువగా ఇస్తే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పకడ్బందీ వ్యూహం రచించి, అమలుచేసే అవకాశం ఉంటుందని, అందువల్ల ఆయనకు సమయం తక్కువగా ఉంటే బాగుంటుందని భావిస్తోంది.

click me!