అపోలో ఆస్పత్రిలో ఈటల రాజేందర్: పడిపోయిన ఆక్సిజన్, బీపీ లెవెల్స్

By telugu teamFirst Published Jul 31, 2021, 12:46 PM IST
Highlights

వీణవంక మండలంలో ప్రజా దీవెన పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గూరైన బిజెపి నేత ఈటల రాజేందర్ ప్రస్తుతం హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈటల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఈటల రాజేందర్ కు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈటల రాజేందర్ శుక్రవారం వీణవంక మండంలో ప్రజాదీవెన పాదయాత్ర చేపట్టారు. ఈ సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆక్సిజన్, బీపీ లెవెల్స్ పడిపోయాయని చెప్పారు. 

వైద్యుల సలహాతో ఈటల రాజేందర్ ను మెరుగైన చికిత్స కొసం హైదరాబాదులోని అపోలోకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, నాయకుడు వివేక్, బిజెపి జాతీయ నాయకురాలు డీకె అరుణ శనివారంనాడు పరామర్శించారు. 

అస్వస్థతకు గురి కావడంతో హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర ఆగిపోయింది. గత కొద్ది రోజులుగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు.

భూకబ్జా ఆరోపణలు రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజేందర్ ను తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బిజెపిలో చేరారు హూజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఈటల రాజేందర్ ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  

click me!